రాష్ట్రంలోని ప్రజలంతా ఆరోగ్యంతో.. ఆనందంగా ఉండాలన్న లక్ష్యంతో పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 15 వరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ, మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీంలు గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ.. పారిశుద్ధ్యం, తాగునీరు, వ్యర్థపదార్ధాల నిర్వహణ వంటి సమస్యలను నియమిత కాల వ్యవధిలో పరిష్కరించేలా చర్యలను చేపట్టాలని ఆదేశించింది. తద్వారా గ్రామాల్లోని మౌలికమైన సమస్యలను త్వరితగతిన గుణాత్మక విలువలతో పూర్తి చేయాలని సూచించింది.
అదే విధంగా గ్రామాల్లో ఉత్సాహవంతులైన యువకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వాలంటీర్స్, గ్రామ పెద్దలు ఓ కమిటీగా ఏర్పడి.. గ్రామంలో సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రణాళికను ఆగష్టు 15న ఆమోదింపచేసి అమలు పరచాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రాబోయే 15 రోజుల్లో 90 శాతం మౌలిక సమస్యలను పరిష్కరించాలని తెలిపింది.