పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన చట్టబద్ధమైన వాటాను రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండికొడుతోందని, తక్కువ స్థాయిలో నీటిమట్టం ఉన్నా.. నిబంధనలకు విరుద్దుంగా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు చేపడుతోందని.. ఇది ఏపీ ప్రజల జీవించే హక్కు హరించటమేనని పిటిషన్‌లో పేర్కొంది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, నదీ జలాల పంపకంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు అమలు చేయడం లేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వివరించింది.
మానవ హక్కుల ఉల్లంఘనే...
బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎగువ ప్రాంతం సాగునీటి, తాగునీటి అవసరాలు లేకుండానే కేవలం విద్యుదుత్పత్తి కోసం.. విలువైన జలాలను సముద్రంలోకి వృథాగా వదిలేసే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో తెలిపింది.