రాష్ట్రంలో విమాన సేవలను పునరుద్ధరించటానికి మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు విధివిధానాలను వెల్లడించింది.
- విమాన ప్రయాణం కోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ స్పందన వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. వాటిని పరిశీలించి ప్రభుత్వం అనుమతించాకే ప్రయాణానికి టికెట్లు కొనుక్కోవాలి.స్పందన ద్వారా అనుమతి పొందిన ప్రయాణికులకే విమానయాన సంస్థలు టికెట్లు విక్రయించాలి.
- రాష్ట్రానికి చేరుకున్న ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అనుమానిత లక్షణాలుంటే వారం రోజులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉంచుతారు. వారం తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.నెగెటివ్ వచ్చినవారు మరో వారం రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలి.
- తక్కువ కేసులున్న ప్రాంతం నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి స్వాబ్ తీసిన తర్వాత 14 రోజుల పాటు గృహ క్వారంటైన్‌లో ఉండాలి. స్వాబ్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే వారి ఇంట్లోనే క్వారంటైన్ లేదా కోవిడ్ రోగులకు ఏర్పాటు చేసిన కేంద్రం, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంటుంది.
ఆఖరి నిమిషంలో మారిన నిర్ణయం
లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన విమానసేవలను సోమవారం నుంచి పునఃప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి తొలుత ఆదేశాలు అందాయి. దీంతో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని ప్రధాన విమానాశ్రయాలను అధికారులు సిద్ధం చేశారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఏడు, విశాఖ, తిరుపతి నుంచి మరో ఏడు సర్వీసులు నడపటానికి సన్నద్ధమయ్యారు. అయితే ఆఖరి నిమిషంలో నిర్ణయం మారింది. బుధవారం నుంచి తిరిగి ప్రారంభించేలా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో విమానాల రాకపోకలకు అక్కడి ప్రభుత్వాలు అంగీకరించలేదని తెలిసింది. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే సర్వీసులు కూడా నిలిచిపోయాయని తెలుస్తోంది.