ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మడమ తిప్పిన రాష్ట్ర సర్కార్​.. తిరిగి ఫసల్‌ బీమా యోజన అమలుకు నిర్ణయం - ఏపీ పంటల బీమా పథకం

కేంద్ర బీమా పథకాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం సరిగా అందట్లేదని వైఎస్సార్‌ ఉచిత పంటలబీమా పథకాన్ని తెచ్చిన రాష్ట్రప్రభుత్వం.. మళ్లీ వెనకడుగు వేసింది. మళ్లీ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), సవరించిన వాతావరణ ఆధారిత పంటలబీమా (ఆర్‌డబ్ల్యుబీసీఐఎస్‌) పథకాలనే అమలుచేయాలని నిర్ణయించింది.

andhra pradesh crop insurance scheme
andhra pradesh crop insurance scheme

By

Published : Aug 9, 2022, 5:07 AM IST

పంటలు దెబ్బతిన్న రైతులకు కేంద్ర బీమా పథకాలతో పరిహారం సరిగా అందట్లేదని వైఎస్సార్‌ ఉచిత పంటలబీమా పథకాన్ని తెచ్చిన రాష్ట్రప్రభుత్వం.. రెండేళ్లకే మడమ తిప్పేసింది. మళ్లీ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), సవరించిన వాతావరణ ఆధారిత పంటలబీమా (ఆర్‌డబ్ల్యుబీసీఐఎస్‌) పథకాలనే అమలుచేయాలని నిర్ణయించింది. కేంద్ర పథకాల నుంచి రెండేళ్ల కిందట బయటకొచ్చి.. సొంతంగా బీమా సంస్థ ఏర్పాటుకూ చర్యలు చేపట్టిన ప్రభుత్వం మళ్లీ అందులోనే చేరడమేంటన్న ప్రశ్న ఎదురవుతోంది. బరువు దించేసుకుందామనే ఆలోచన ఎంతవరకూ సబబని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ఫసల్‌ బీమా అమలు చేస్తామంటున్నా వేరుసెనగకు నమోదు గడువు ముగియడం, వాతావరణ ఆధారిత బీమాలో సరైన ప్రయోజనాలు అందవని కలవరపడుతున్నారు.

పీఎంఎఫ్‌బీవై, వాతావరణ ఆధారిత బీమా పథకాల ద్వారా ప్రీమియం రూపంలో బీమా సంస్థలకు అందే మొత్తంతో పోలిస్తే.. రైతులకు అందే పరిహారం తక్కువ. ఒక సీజన్‌లో పంటనష్టం జరిగితే.. మరో రెండు సీజన్లు ముగిసినా పరిహారం అందేది కాదు. దీంతో బిహార్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో సొంత పథకాలే అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రెండేళ్ల నుంచి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలుచేస్తున్నా.. ఈ ఏడాది మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రంలో ఉచిత పంటల బీమా ప్రారంభించాక.. 2019-20 ఖరీఫ్‌లో ప్రైవేటు బీమా సంస్థల ద్వారానే పథకాన్ని అమలుచేశారు. దీనికి కేంద్రం తన వాటా ప్రీమియం జోడించింది. 2020-21 నుంచి రాష్ట్రం సొంతంగా అమలుచేస్తోంది. ప్రత్యేకంగా బీమాసంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఐఆర్‌డీఏ అనుమతి రావాలి. 2020-21, 2021-22 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వమే పంటనష్టాన్ని లెక్కించి పరిహారమిస్తోంది. రెండేళ్లపాటు ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమాగా రూ.4,798 కోట్లు విడుదల చేసింది. కానీ పంట నష్టపోయిన అందరికీ బీమా దక్కలేదు.

  • ఉచిత బీమాలో రబీ నష్టం ఊసే లేదు. అదేమంటే పంటనష్టమే లేదంటోంది. 2016-17 నుంచి 2018-19 వరకు రబీలో రైతులకు పరిహారం అందింది. తర్వాత లేదు.
  • ఖరీఫ్‌ పంటలకే ఇస్తున్నా.. చెల్లించాల్సిన బీమా మొత్తం బడ్జెట్‌ అంచనాకు మించిపోతోందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే పీఎంఎఫ్‌బీవై, వాతావరణ ఆధారిత బీమా పథకాల్లో చేరితే కేంద్రం నుంచి వాటా రాబట్టుకోవచ్చనే ఆలోచనతోనే ఆ దిశగా అడుగులేశారు. రైతుల తరఫున తాము చెల్లిస్తున్న మొత్తాన్నీ తగ్గించుకునే ఆలోచనలో సర్కారు ఉంది. రైతువాటాను కేంద్రం కూడా భరించాలనే ప్రతిపాదన తెచ్చింది. దీనికి కేంద్రం అంగీకరిస్తే రాష్ట్రంపై బీమా భారం మరింత తగ్గుతుంది.

లోపాలు సరిదిద్ది అమలుచేయాల్సింది పోయి..:రాష్ట్రప్రభుత్వం అమలుచేసే వైఎస్సార్‌ ఉచిత పంటలబీమా పథకం ద్వారా విస్తీర్ణం, రైతుల సంఖ్య.. ఇచ్చే బీమా పరిహారం కొంతమేర పెరిగినా ఇందులోనూ లోపాలున్నాయి. వీటిని మరింత మెరుగుపరిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ-పంటలో నమోదైన ప్రతి ఎకరానికీ బీమా అంటున్నా.. క్షేత్రస్థాయిలో బీళ్లు, కొండలు, శ్మశానాలు, ఇతర సాగుచేయని భూములనూ నమోదుచేసి పరిహారం ఇస్తున్నారు. ఈ సమస్యలను సరిదిద్దాలి.

  • చీడ పురుగులతో నష్టం జరిగినా గతంలో పరిహారం అందేది కాదని, ఇప్పుడు పరిస్థితి మారిందని సీఎం జగన్‌ చెప్పారు. గతేడాది నల్లి కారణంగా 5లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్న మిరప రైతులు.. సగటున ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టపోయారు. చెల్లింపు రాష్ట్రం చేతిలోని పనే అయినా.. ఈ నష్టం బీమా పరిధిలోకి రాదంటూ వ్యవసాయశాఖ పరిహారం ఇవ్వలేదు.
  • 2.10 లక్షల ఎకరాల్లో సాగయ్యే పొగాకుకు బీమా లేదు. రబీలో పరిహారం ఇవ్వకపోవడంతో సెనగ, మామిడి తదితర పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
  • 2020-21, 2021-22 సంవత్సరాల్లో అతివృష్టి, అనావృష్టితో పంటలన్నీ దెబ్బతిన్నాయి. వాస్తవ నష్టంతో పోలిస్తే.. పరిహారం తక్కువగా ఇచ్చారని రైతులంటున్నారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా కింద రూ.2,978 కోట్లను జూన్‌ 14న ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనుమానిత కేసుల పేరుతో కొందరికి ఇప్పటికీ బీమా పరిహారం జమకాలేదు.

అప్పుడు బాగోలేనిది.. ఇప్పుడు బాగైపోయిందా?:కేంద్రం అమలుచేసే పంటల బీమా పథకాలు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవని సీఎం జగన్‌ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. రైతులు రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా ఈ-పంటలో నమోదైన ప్రతి ఎకరానికీ బీమా పరిహారం చెల్లిస్తామన్నారు. రెండేళ్లకే మళ్లీ కేంద్ర పథకంలో చేరుతున్నామన్నారు. అప్పట్లో ఏ లోపాల కారణంగా రాష్ట్రమే సొంతంగా అమలు చేసిందో.. అవే పునరావృతం అవుతాయనే అంశాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. పంటకోత ప్రయోగాలు, వాతావరణ ఆధారిత లెక్కలతో న్యాయం జరగదని, పంటల బీమా అందని ద్రాక్షగా మారుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:వైకాపా కౌంట్​ డౌన్​ స్టార్ట్​.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్​కు టూలెట్ బోర్డు: అచ్చెన్నాయుడు

TOMATO: అనంతలో 'టమాటా @ 2 రూపాయలు'.. రోడ్డు పక్కన పారబోస్తున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details