Government decision on Lands: ఉచిత అసైన్డ్ ఇళ్లస్థలాలు, వాటిలో కట్టిన ఇళ్లను కొనుగోలు చేసి అనుభవిస్తున్న వారు, వారి వారసులకు.. ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పించనున్నారు. అయితే, వీరికి ఎవరైతే అమ్మారో.. వారికి ప్రభుత్వం స్థలం కేటాయించి 17.09.2021 నాటికి పదేళ్లు పూర్తయి ఉండాలి. దరఖాస్తుదారులు తగిన రుజువు పత్రాలతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తహశీల్దారు విచారణ జరిపి, సంతృప్తి చెందితేనే యాజమాన్య హక్కులు కల్పిస్తారు. అనంతరం ఈ భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించేలా చర్యలు తీసుకుంటారు. ఇంటి స్థలంలో గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రుణం పొందితే ఏకకాల పరిష్కారం పథకం (ఓటీఎస్) కింద చెల్లించాలి. సదరు స్థిరాస్తికి చెల్లించాల్సిన అన్ని పన్నులనూ దరఖాస్తుదారులే చెల్లించుకోవాలి. ప్రభుత్వశాఖల నుంచి నిరభ్యంతర పత్రం అవసరం లేకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు ఎవరు అర్హులు?: అసైన్డ్/డీకేటీ స్థలాల్లో నివాసం ఉంటున్నవారు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాలున్న వారే కాకుండా.. వారి వారసులు, కొన్నవారూ తమకు సంపూర్ణ హక్కులు కోరవచ్చు. ప్రభుత్వం మంజూరుచేసిన ఫలానా వ్యక్తి నుంచి తాను ఇల్లు/స్థలం కొన్నానని, తనకు సంపూర్ణ హక్కు కల్పించాలని కోరుతూ గ్రామ సచివాలయం ద్వారా తహశీల్దారుకు దరఖాస్తు చేయాలి. దానితోపాటు ఒరిజనల్ డీకేటీ ఇంటి స్థలం పట్టా, కొనుగోలు పత్రాన్ని జతపరచాలి. వారసులూ ఇలాగే దరఖాస్తు చేయాలి. ఒరిజినల్ డీకేటీ పట్టా జతచేయాలని ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.