houses for poor peoples case: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. అర్హులైన ‘పిటిషనర్ల’కు ఇంటి స్థలాలు కేటాయిస్తేచాలని వారి తరఫు సీనియర్ న్యాయవాది వీఎస్‌ఆర్ ఆంజనేయులు ధర్మాసనానికి నివేదించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను ఆయన ప్రస్తావిస్తూ... అందులో మొత్తం 128 పిటిషనర్లలో 52 మందికి స్థలాలు ఇచ్చినట్లు, మిగిలిన వారు దరఖాస్తు చేసుకుంటే చట్ట ప్రకారం పరిశీలించి వారికి మంజూరు చేస్తామని తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని, వాటిని అధికారులు పరిష్కరించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. సీనియర్ న్యాయవాది అభ్యర్థనపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇరువైపులా వాదనలను నమోదు చేసిన ధర్మాసనం.. ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ‘వ్యాజ్యాన్ని’ ఉపసంహరించుకుంటున్నామని చెబుతున్నందున సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులోని అంశాల్లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇంటి స్థలం కోసం మూడు వారాల్లో పిటిషనర్లు తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఇళ్ల పథకం మార్గదర్శకాల ప్రకారం ఆ దరఖాస్తులను పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ నేపథ్యం...
houses for poor peoples case: ఈ పథకం కింద 25లక్షల ఇళ్ల స్థలాలు/హౌజింగ్ యూనిట్లు ఇచ్చే నిమిత్తం మార్గదర్శకాలకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబర్‌లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇళ్ల ప్లాట్లను కేవలం మహిళ లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఇళ్ల పట్టాలను మహిళ లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టారు. మహిళలతో పాటు అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు పట్టాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1సెంటు ఇంటి స్థలం కోసం కేటాయించడాన్ని ఆక్షేపించారు. అధ్యయనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలన్నారు. అప్పటివరకు ఆయా భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ అక్టోబర్ 8న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వేసింది. 24న విచారణ చేపట్టిన ధర్మాసనం.. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాల్ని పిటిషనర్ల తరఫు సీనియర్ వీఎస్‌ఆర్ ఆంజనేయులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తూ అప్పీల్‌పై విచారణను మూసివేయాలన్నారు.
2.62లక్షల లబ్ధిదారులకు పీఎంఏవై ఇళ్లు
- హైకోర్టుకు ప్రభుత్వ నివేదన
houses for poor peoples case: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద గృహాలు నిర్మించి, 2022 డిసెంబర్ నాటికి 2,62,216 ఇళ్లు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొంటూ పురపాలకశాఖ(ఎఫ్‌ఏసీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2021 డిసెంబరుకి 45,000 ఇళ్లు, 2022 మార్చికి 75,000, 2022 జులైకి 70,000, 2022 డిసెంబర్ నాటికి 72,216 ఇళ్లు అప్పగిస్తామన్నారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలో 1,000 ఇళ్లు ఇప్పటికే అప్పగించామన్నారు. హుద్‌హుద్ తుపాను కారణంగా నిర్మించిన 5,786 గృహాలను అప్పగించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించింది. కోర్టుకు నివేదించిన గడువు మేరకు అధికారులు ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. పీఎంఏవై పథకం కింద నిర్మితమైన గృహాలను లబ్ధిదారులకు ఇవ్వలేదంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జె.బాలాజీ గతేడాది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. లబ్ధిదారులకు ఇళ్లను ఎప్పుడు అప్పగిస్తారన్నది నిర్దిష్టంగా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.