SC on Rushikonda excavations: రిషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రిషికొండ తవ్వకాలపై అభ్యంతరం తెలుపుతూ వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖను జాతీయ హరిత ట్రైబ్యనల్(ఎన్జీటీ) సుమోటోగా తీసుకుంది. రిషికొండ తవ్వకాలను నిలుపుదల చేయాలని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈనెల 6న ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ మధ్యంతర స్టే విధించింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్టును అన్ని అనుమతులతోనే చేపట్టామన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఎన్జీటీ, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా నియమించిన కమిటీ.. ఎక్కడా పర్యావరణ ఉల్లంఘనలు లేవని క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ మరోసారి అధ్యయనం కోసం మరో కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా పనులు నిలుపుదల చేసింది. తమ వాదనలు వినకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా స్టే ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దం. తొలుత నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టారని సింఘ్వి పేర్కొన్నారు.