కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో పిట్టీ రైల్ అండ్ ఇంజినీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ సంస్థకు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిట్టీ రైల్ కంపెనీకి 117.85 ఎకరాల భూమి కేటాయిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు 10 లక్షల చొప్పున ఈ స్థలం కేటాయించినట్లు పరిశ్రమల శాఖ అదేశాలలో పేర్కొంది.
మొదట వచ్చే 5 ప్రాజెక్టులకు కల్పించే ప్రత్యేక రాయితీల్లో భాగంగా పిట్టీ రైల్ సంస్థకు రాయితీలను కల్పిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఎనిమిదేళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపుల వంటి రాయితీలను కల్పించనున్నారు. ఐదేళ్ల పాటు పరిశ్రమలో వినియోగించే విద్యుత్ యూనిట్‌కు కేవలం రూపాయి చొప్పున మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.