ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపోరు నిర్వహణకు కసరత్తు ముమ్మరం..!

పురపోరుకు సమాయత్తమయ్యే క్రమంలో... వార్డుల పునర్విభజన ప్రక్రియ వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సగం చోట్ల ఈ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన చోట్ల కూడా పునర్విభజన చేసి ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.

పురపోరు

By

Published : Nov 23, 2019, 9:08 PM IST

2011 జనాభా లెక్కల ప్రకారం... ఇప్పటికే 64 పురపాలక సంఘాల్లో వార్డులను పునర్విభజిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులను లెక్కించి ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. మరో 21 పురపాలకల్లో వార్డుల పునర్విభజనకు ఆదేశాలు వెలువడ్డాయి. మిగిలిన పురపాలక, నగరపాలక సంస్థల్లోనూ ఇంకో 2 దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పురపాలక, నగర పాలక సంస్థల్లో పాలకవర్గాల పదవీ కాలం పూర్తవటంతో... తదుపరి ఎన్నికల నిర్వహణకు 1991 జనాభా లెక్కల ప్రకారం వివరాలు సేకరించి ఓటర్ల జాబితా సిద్ధం చేశారు.

కడప నగరపాలక సంస్థకు సంబంధించి... ఓ కేసులో హైకోర్టు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కొన్ని మార్పులు, చేర్పులతో ఆగస్టు నెల నుంచి మరోసారి జాబితాల తయారీ చేపట్టింది. అన్ని వార్డుల్లోనూ జనాభా ఒకే రీతిలో ఉండేలా పునర్విభజిస్తూ... ఓటర్ల జాబితా రూపొందించాలనే ఆదేశాలతో... ఇప్పటికే సగరం పురపాలక, నగర పాలక సంస్థల్లో ఈ ప్రక్రియ పూర్తయింది.

విశాఖ మహా నగరపాలక సంస్థ, విజయవాడ, ఏలూరు నగరపాలక సంస్థలతో పాటు మరో 16 పురపాలికల్లో చుట్టూ ఉన్న గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనలు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉన్నాయి. దీనిపై వచ్చేనెల మొదటి వారంలో ఉన్నతస్థాయి కమిటీ ఓ నిర్ణయం తీసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

50 శాతానికి లోబడే...
గ్రామసభలు నిర్వహించటంతోపాటు... ప్రత్యేక అధికారుల ఆమోదంతో తీర్మానం చేశాకే... విలీన ప్రతిపాదనలు కలెక్టర్ల నుంచి పురపాలక శాఖకు వచ్చాయి. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వీటిలోనూ వార్డుల పునర్విభజనకు తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పురపాలక, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.

వాటిని ఎన్నికల సంఘానికి అందజేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. మరోసారి అదే విధానంలోనే పురపాలక ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details