ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన పొదుపు సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. పెరిగే విద్యుత్ డిమాండ్‌తో పాటు ఇంధన వ్యయాన్ని అదుపులో ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
తొలిదశలో రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధన పరిరక్షణ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ఇంధన భద్రత సాధించేందుకు అంతర్జాతీయంగా అవలంబిస్తున్న విధానాలు అమలు చేయాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇంధన పొదుపునకు అవసరమైన పరికరాలను కూడా వినియోగించాలని నిర్ణయించారు. ఈమేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ కార్యాచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 64 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని.... ఇంధన పరిరక్షణ చర్యలు చేపడితే 16 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసే అవకాశముందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.