రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందని తెలిపారు. 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ అందించి పరిశ్రమలకు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. సచివాలయంలో తనను కలిసిన సింగపూర్ ప్రతినిధి బృందానికి మంత్రి ఈ అంశాలు వివరించారు. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని సింగపూర్ ప్రతినిధుల బృందానికి స్పష్టం చేశారు.
ఆ పరిస్థితి పునరావృతం కాదు
గతంలో శిక్షణ ఇవ్వకుండా కేవలం పరిశ్రమల్లో కిందస్థాయి పనులు చేసే వారికే ఉద్యోగాలు వచ్చేవని విమర్శించారు. ఆ పరిస్థితి పునరావృతం కానీయబోమని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలతో స్నేహపూర్వకంగా ఉండే పారదర్శక పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో వ్యవహరిస్తామన్నారు. స్పష్టమైన ప్రణాళిక రూపొందించి పరిశ్రమలకు అవసరమైన మేరకే ప్రోత్సాహకాలు అందింస్తామని స్పష్టం చేశారు.