ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలకు రాష్ట్ర ఆర్థిక లెక్కలను కాగ్ పరిశీలించి తుది రూపం ఇచ్చింది. వీటి ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో వివిధ మార్గాల్లో రూ.20,463 కోట్ల రాబడి వచ్చింది. అదే సమయంలో ఖర్చు ఏకంగా రెట్టింపు దాటిపోయింది. అది రూ.42,863.21 కోట్లు! అదే సమయంలో అప్పులు, ఇతర రుణ బాధ్యతలు రూ.22,427.76 కోట్లుగా కాగ్ పేర్కొంది. ఇందులో ప్రజారుణం రూ.9,449.84 కోట్లుగా చూపించి ప్రజాపద్దులో ఉన్న రూ.13,089.75 కోట్లు కలిపి ఈ అప్పును లెక్కించింది. (ఇందులో నగదు నిల్వ రూ.111.83 కోట్లు తీసేసింది). మొత్తం మీద రెవెన్యూ లోటు ఏకంగా తొలి రెండు నెలల్లోనే రూ.20,113.60 కోట్లకు చేరింది. పెట్టుబడి వ్యయం.. అంటే తిరిగి ఆదాయం సృష్టించే ఖర్చు రూ.2,285.85 కోట్లుగా ఉంది.
తీవ్ర ప్రభావం చూపిన కరోనా..
తొలి రెండునెలల్లో వివిధ పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.13,681 కోట్లుగా లెక్కించారు. ఇందులో జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటా, ఇతర పన్నులు, సుంకాలు ఉన్నాయి. దీనికి కేంద్రం విడుదల చేసే గ్రాంటు కూడా కలవగా రాబడి రూ.20,463.76 కోట్లకు చేరింది. పన్నేతర ఆదాయం మరో రూ.553.41 కోట్లు వచ్చి కలిసింది. రాష్ట్రంలో ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు పెరుగుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో కరోనా తీవ్రత రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రస్తుతం ఈ ఏడాది మే నాటికి కరోనా రెండోదశ ఉన్నా రాబడి పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో పన్ను ఆదాయం రూ.6,745.40 కోట్లు మాత్రమే. ఇప్పుడది దాదాపు రెట్టింపై రూ.13,681 కోట్లు వచ్చింది. కిందటి ఏడాది కేంద్ర పన్నుల్లో వాటా రూ.2,391.36 కోట్లు వస్తే ఈ ఏడాది తగ్గింది. కేంద్ర అందించే సాయం మాత్రం దాదాపు రూ. వెయ్యి కోట్లు పెరిగింది.
ఇదీ చదవండి:home minister reservation: హోంమంత్రి రిజర్వేషన్‌పై ఎస్సీ కమిషన్ విచారణ