రాష్ట్రంలో నవంబరు మొదటి వారం నుంచి పత్తితీతలు పెరిగాయి. ధరలు బాగుండటంతో రైతులు వెంటనే అమ్మేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరల్ని తగ్గిస్తున్నారు. అక్టోబరు 28న కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో కనిష్ఠంగా క్వింటా రూ.7వేల వరకు లభించిన ధర ఇప్పుడు రూ.4,800కి తగ్గింది. నవంబరు 2న క్వింటా గరిష్ఠంగా రూ.9,011 చొప్పున ఉంటే, ఇప్పుడు రూ.8వేలకు పడిపోయింది.
- గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని పలు గ్రామాల్లో గత వారం వరకు క్వింటా పత్తికి రూ.8వేల వరకు ఇచ్చి కొన్నారు. తర్వాత క్రమంగా తగ్గిస్తూ.. ఇప్పుడు రూ.7వేల వరకే ఇస్తున్నారు. ఆలస్యం చేస్తే ఈ ధర కూడా ఉండదేమోనని రైతులు అమ్మేస్తున్నారు. పత్తి గింజలకు క్వింటా రూ.600 వరకు, దూది ధరలు క్యాండీకి రూ.4,500 వరకు తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లో నిలకడగా
దేశంలో పత్తిని సాగుచేసే ఇతర రాష్ట్రాల్లో ధరలు నిలకడగానే ఉన్నాయి. శుక్రవారం పంజాబ్‌లోని అబోహర్, హరియాణాలోని శివాని, రాజస్థాన్‌లోని పిలిబంగ మార్కెట్లలో పత్తికి క్వింటా కనిష్ఠంగా రూ.7,350 పైన, గరిష్ఠంగా రూ.8,980 వరకు (ఈనాం మార్కెట్ సమాచారం) ఉంది. తెలంగాణలోని వరంగల్ మార్కెట్లోనూ క్వింటా కనిష్ఠంగా రూ.7,050, గరిష్ఠంగా రూ.7,810 చొప్పున లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోనే కనిష్ఠ ధరలు తక్కువగా ఉన్నాయి.
- అంతర్జాతీయంగానూ పత్తి ధరల్లో పెద్దగా తేడా లేదు. అమెరికా ఫ్యూచర్‌మార్కెట్లో పౌండ్ (453.592 గ్రాముల) దూది 118 నుంచి 119 సెంట్ల వద్ద నమోదవుతోంది. 10రోజుల కిందటి ధరలే ఉన్నాయి.