ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘రాయలసీమ’ సందర్శన అవసరం లేదు.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ లేఖ - కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ లేఖ తాజా వార్తలు

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతిపాదించిన నిజ నిర్ధారణ కమిటీ తొలుత సందర్శించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ జల వనరులశాఖ ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు.

esc letter to Krishna board
esc letter to Krishna board

By

Published : Mar 16, 2021, 9:03 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిపుణుల కమిటీ సందర్శించడం కన్నా ముందు తెలంగాణలోని ప్రాజెక్టులను ఆ కమిటీ పరిశీలించేలా నిర్దేశించాలని కృష్ణా బోర్డు కార్యదర్శికి ఈఎన్‌సీ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలనకు తాము ఒక కమిటీని నియమించామని, కమిటీకి సహకరించేలా నోడల్‌ అధికారిని నియమించాలని బోర్డు రాసిన లేఖకు ప్రతి స్పందనగా ఆయన ఈ లేఖ రాశారు. ‘నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా 8 ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తున్న విషయాన్ని పలు సార్లు బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి, భక్త రామదాసు, తుమ్మిళ్ల, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు (మిషన్‌ భగీరథ), కాళేశ్వరం, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను.. ఎలాంటి నీటి కేటాయింపులు లేకుండా డీపీఆర్‌లకు ఆమోదం పొందకుండా కేంద్ర జల సంఘం ఆమోదించకుండా తెలంగాణ నిర్మిస్తోంది. కేంద్ర జలశక్తిశాఖ ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్దేశించింది.

ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఇంజినీర్లతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేలా ఆ ప్రాజెక్టులను సందర్శించాలి’ అని ఏపీ కోరింది. ’తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించేందుకు కమిటీ వేయాలని మేం డిమాండు చేస్తే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు కృష్ణా బోర్డు కమిటీ వేయడం ఏమిటి?’ అని ఈఎన్‌సీ ప్రశ్నించారు. ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించాలని కృష్ణా బోర్డును ఆదేశించలేదు. ఈ ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం లేదు’ అని ఆ లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు.

కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను మార్చాలంటూ కేంద్రానికి ఫిర్యాదు!

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ పరమేశంను మార్చాలని కేంద్ర జలశక్తిశాఖకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జల వనరులశాఖ కార్యదర్శి ఈ మేరకు లేఖ రాశారని సమాచారం. ఆయన తెలంగాణకు చెందినవారు కావడంతో ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను మార్చాలని విన్నవించినట్లు తెలిసింది. తాజాగా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఫిర్యాదులు సాగుతున్నాయి. ఏయే సందర్భాల్లో పరమేశం ఎలా వ్యవహరించారో పేర్కొంటూ కేంద్ర జల మంత్రిత్వశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి:బీఎండబ్ల్యూ జాయ్‌ డేస్‌.. కార్లపై డీల్స్‌

ABOUT THE AUTHOR

...view details