పీఆర్సీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తూనే ఉన్నారు. అసలు ఆ నివేదికలో ఏముందో ఇప్పటికీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎంత మొత్తానికి ఫిట్‌మెంటును అశుతోష్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది? ఉద్యోగుల ఇతర డిమాండ్లలో వేటికి చోటు కల్పించిందన్న అంశాలు గోప్యంగానే ఉన్నాయి. తొలుత నివేదికను ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చి.. ఆనక చర్చల ప్రక్రియ ప్రారంభించి ఫిట్‌మెంటును ఖరారు చేసి వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలే ఒకటో తేదీన అందడం లేదు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లదీ అదే పరిస్థితి.
ప్రతి ఐదేళ్లకోసారి..
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేస్తుంటారు. 11వ వేతన సవరణ కమిషన్‌ను 2018లోనే ఏర్పాటు చేశారు. గడువు ప్రకారం.. ఉద్యోగులకు కొత్త వేతన సవరణ 2018 జులై ఒకటినుంచి అమలు చేయాలి. అసలు వేతన సవరణ సంఘాన్ని నియమించిందే 2018 మే 28న. అప్పటినుంచి కమిషన్‌కు ఇచ్చిన గడువును ప్రభుత్వం పెంచుతూ పోయింది. అయినప్పటికీ నివేదిక అమలువైపు అడుగులు పడుతున్న దాఖలాలు లేవని ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. 2019 జులై నుంచి 27 శాతం మధ్యంతర భృతిని అమలు చేస్తున్నారు.
ఆరుసార్లు గడువు పెంపు
11వ వేతన సవరణ సంఘం ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. 2018 మే 28న కమిషన్ ఏర్పాటైంది. నెల దాటాక అశుతోష్ మిశ్రాకు కమిషనరుగా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. నివేదిక సమర్పణకు ఏడాదిలోపు గడువు విధించింది.
*2 నెలలకు మొదటిసారి గడువు పెంచారు. 2019 సెప్టెంబరు 30 నాటికి నివేదికివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
*మరో 2 నెలలకు రెండోసారి గడువు పెంచి 2019 నవంబరు 30 వరకు అవకాశమిచ్చారు.
*తిరిగి మూడోసారి 2 నెలల గడువు పెంచారు. 2020 జనవరి 31 నాటికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులనిచ్చారు.
*నాలుగోసారి మరో 2 నెలల గడువు పెంపు. 2021 మార్చి 31 నాటికి నివేదిక ఇవ్వాలన్నారు.
*2020 మార్చి నెలకు ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారు. వారికి సంబంధించిన వేతన సవరణ అంశాలనూ అధ్యయనం చేయాలని ప్రభుత్వం.. కమిషన్‌ను కోరింది. ఈ కొత్త అంశం చేర్చినందున 3నెలలపాటు గడువు పెంచింది. ఇది అయిదోసారి గడువు పెంపు. 2020 జూన్ 30 వరకు అవకాశమిచ్చింది.
*మళ్లీ ఆరోసారి 3 నెలల గడువు పెంచింది. 2020 సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.
*ఎట్టకేలకు 2020 అక్టోబరు 5న వేతన సవరణ కమిషన్ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించింది. నివేదిక అందాక 6 నెలలకు ప్రభుత్వం స్పందించింది. దాన్ని అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల కమిటీని ఏప్రిల్ 1న నియమించింది. ఆ తర్వాత ఏ అడుగూ పడలేదు.
ఏ మాత్రం ఆలస్యం తగదు