ap employees steering committee: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు పీఆర్సీలను కోల్పోయారని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. స్టీరింగ్ కమిటీ ముగిసిన అనంతరం.. నేతలు మీడియాతో మాట్లాడారు. వేతన సవరణ తేదీకి.. అమలు తేదీకి ప్రభుత్వాల వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్ లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని వ్యాఖ్యానించారు. సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని నేతలు స్పష్టం చేశారు.
రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తుందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదని.. సమస్యల పరిష్కారమే కావడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
"వాస్తవాలు బయటపెట్టకుండా ఉద్యోగులను కించపరుస్తున్నారు. చర్చల పేరిట ఉద్యోగులను అవమానపరుస్తున్నారు. బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా..? చర్చలకు పిలిచి చాయ్, బిస్కెట్ ఇచ్చి పంపుతున్నారు. సమ్మెలోకి వెళ్తే జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మొన్న చర్చలకు వెళితే అరగంటలో మాట్లాడి చెబుతామన్నారు. ఆరు గంటలైనా సమస్య పరిష్కారం చేయలేదు. సజ్జలకు ఫోన్ చేస్తే.. అయ్యో! మీరింకా అక్కడే ఉన్నారా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను జఠిలం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదు.. సమస్యల పరిష్కారమే తమకు కావాలన్నారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా చెప్పి చూశాకే సమ్మెకు వెళ్తున్నాం. ఉద్యోగులు చర్చలకు ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నారు" - బొప్పరాజు వెంకటేశ్వర్లు
భయపెట్టేలా బదిలీలు: బండి శ్రీనివాసరావు
అనమోలిస్ కమిటీ అంటున్న అధికారులకు దానిపై అవగాహన లేనట్టుందని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వేతన సవరణలో ఒక సీనియర్ ఉద్యోగికి జూనియర్ కన్నా అన్యాయం జరిగితే దానిని పరిష్కరించడానికి ఆ కమిటీ పని చేస్తుందన్నారు. ఉద్యోగుల ఉద్యమాన్ని చంపేందుకు ప్రభుత్వం కొన్ని ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు అనామలిస్ కమిటీ ఎక్కడుందో ఉద్యోగులు వెతుక్కోవాలా? అని ప్రశ్నించారు. వేతన గణన అనేది అర్థం కాని బ్రహ్మపదార్థంలా అధికారులు మార్చేశారని విమర్శించారు. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను పక్కన పెట్టి అధికారుల కమిటీ నివేదిక అమలు చేసి అన్యాయం చేశారని చెప్పారు. ఓ వైపు అభ్యంతరాలు చెప్పుకునే సమయంలోనే చీకటి జీవోలు ఇచ్చారన్నారు. ఉద్యోగులను భయపెట్టేలా బదిలీలు చేసేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఎత్తుగడలను ఉద్యోగులు, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరిస్తే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.