ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఉద్యమ కార్యాచరణ యథాతథం: పీఆర్సీ సాధన సమితి

ఉద్యమ కార్యాచరణ యథాతథం
ఉద్యమ కార్యాచరణ యథాతథం

By

Published : Feb 1, 2022, 7:25 PM IST

Updated : Feb 1, 2022, 8:14 PM IST

19:16 February 01

చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - పీఆర్సీ సాధన సమితి

ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని పీఆర్సీ సాధన సమితి నేతలు మండిపడ్డారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్లేనని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్‌ అన్నారు. చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారన్నారు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు. చలో విజయవాడను విజయవంతం చేయాలని ఉద్యోగలకు సూచించారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను మానుకోవాలని కలెక్టర్లకు సూచించిన ఆయన..ఉద్యోగులను భయపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రతి అంశంపై ప్రభుత్వానికి సహకరించాయని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక అంశాలపై స్లైడ్లు వేసి మమ్మల్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

"మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్లే. చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుంది. చలో విజయవాడను విజయవంతం చేయాలి. ఉద్యోగులను భయపెట్టవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలి. సమ్మె, ఆందోళన తాత్కాలికం.. మళ్లీ కలిసే పని చేయాలి."-బండి శ్రీనివాస్‌

కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్లు పదేపదే చెప్పామని బండి శ్రీనివాస్‌ అన్నారు. ఇవాళ్టి భేటీలోనూ పాత అంశాలపైనే మాట్లాడారన్నారు. తాము చెప్పిన 3 అంశాలపై తేల్చాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తాము చెప్పిన అంశాల పరిష్కారం సాధ్యపడదని మంత్రుల కమిటీ చెప్పిందని అన్నారు.

జీతాలు పెరిగాయనడం మోసం చేయడమే..

వేతన సవరణను ప్రభుత్వం ప్రహసనంలా మార్చిందని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ అన్నారు. నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని మంత్రుల కమిటీని కోరినట్లు వెల్లడించారు. బలవంతంగా కొత్త జీతాలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. డీఏ బకాయిలతో జీతాలు పెరిగాయనడం మోసం చేయటమేనని అన్నారు. తమ డిమాండ్లు అసంబద్ధమైనవని సజ్జల సమాచారం పంపినట్లు వెల్లడించారు.

"వేతన సవరణను ప్రభుత్వం ప్రహసనంలా మార్చింది. నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని కోరాం. బలవంతంగా కొత్త జీతాలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. డీఏ బకాయిలతో జీతాలు పెరిగాయనడం మోసం చేయడమే. మా డిమాండ్లు అసంబద్ధమైనవని సజ్జల సమాచారం పంపారు." -సూర్యనారాయణ, ఉద్యోగ సంఘం నేత

డీడీవోలను బెదిరించి కొత్త జీతాలు వేశారు..

డీడీవోలను బెదిరించి కొత్త జీతాలు వేశారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ నివేదిక చాలా ముఖ్యమని మంత్రుల కమిటీకి చెప్పినట్లు తెలిపారు. నివేదికపై ప్రభుత్వ కమిటీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. యథావిధిగా చలో విజయవాడ కార్యక్రమమం నిర్వహిస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

ఆ నివేదిక ఇస్తే అంతా అయిపోతుందా: సజ్జల

పీఆర్సీ జీవోలు, ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ మైండ్​తోనే తాము చర్చలు చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు అన్యాయం చేయాలన్న ఉద్దేశ్యం తమకు లేదని వెల్లడించారు. ఉద్యోగుల డిమాండ్లలో ఒకటి ఇక వర్తించదని స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త జీవో ప్రకారం.. వేతనాలు వారి ఖాతాల్లో జమ అయ్యాయని వ్యాఖ్యానించారు.

కొన్ని అంశాలను సర్దుబాటు, మార్పులు చేసే అవకాశం ఉందని సజ్జల చెప్పారు. ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నుంచి ఏదో సాధించాలనే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదని సజ్జల స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదికను పదే పదే అడగడం ఎందుకని.. ఆ నివేదిక ఇస్తే అంతా అయిపోతుందా అని ప్రశ్నించారు. అసలు చర్చించాల్సిన అంశాలు వదిలేసి... దానిపైనే ఉద్యోగ సంఘాలు ఎందుకు పట్టుబడుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.

"చర్చలు ప్రారంభమయ్యాయి.. ఇంకా ముందుకెళ్తాం. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీలు అనేవి ఏమీ లేవు. ఉద్యోగ సంఘాల నేతలు 3 డిమాండ్లను మా ముందుంచారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయడం భావ్యం కాదని చెప్పాం. కొత్త జీవో ప్రకారం ఇప్పటికే కొత్త వేతనాలు వేశాం. మేం ఓపెన్ మైండ్‌తోనే చర్చిస్తున్నాం. ఒత్తిడి తెచ్చి ఏదో సాధించాలని ప్రయత్నించడం సరికాదు. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదు. పీఆర్సీ నివేదికపై అంత పట్టుదల ఎందుకు? పీఆర్సీ నివేదిక ఇస్తే సమస్య పరిష్కారం అయినట్లా. పీఆర్సీ నివేదికను తెలంగాణ కూడా ఇవ్వలేదు. పీఆర్సీ నివేదికను తెలంగాణ తర్వాత వెబ్‌సైట్‌లో పెట్టింది. అసలు విషయాలు వదిలి పీఆర్సీ నివేదికనే ఎందుకు కోరుతున్నారు.?" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

ఇదీ చదవండి..

AP PRC GOs: అసలు విషయాలు వదిలి.. పీఆర్సీ నివేదికనే ఎందుకు కోరుతున్నారు?: సజ్జల

Last Updated : Feb 1, 2022, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details