ORDER TO SERVE: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జనాభా, సంస్థల (విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు వగైరా) ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల్లో కూడా జిల్లా స్థాయిలో ఉన్న వారికి మాత్రమే ‘ఆర్డర్ టు సర్వ్’ (ప్రొవిజినల్ కేటాయింపు) కింద కొత్త జిల్లాలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధిపతులకు సూచిస్తోంది. గ్రామ, మండల స్థాయి ఉద్యోగులు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. కేడర్ల వారీగా పోస్టులు తక్కువగా ఉంటే..కింది పోస్టులను ఉన్నతీకరించి ఆ లోటును భర్తీ చేస్తారు.
మంజూరు పోస్టులెన్ని? సర్దుబాటు ఎలా?
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ రెండు విడతలుగా వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఉద్యోగుల విభజన ఎలా జరగాలన్న దానిపై వివరించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 70వేల మంది వరకు ఒప్పంద ఉద్యోగులు, లక్ష మంది వరకు పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాల్లో ఉన్న పోస్టులు ఎన్ని? వాటిల్లో శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి.. ఎంతమంది పనిచేస్తున్నారన్న వివరాలను సిద్ధం చేయాలని సమావేశానికి హాజరైన అధికారులను కోరారు. త్వరలో ఇవ్వనున్న మార్గదర్శకాల గురించి చెబుతూ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో ఉన్న ఉద్యోగుల విభజన ఎలా జరిగేందుకు అవకాశం ఉందో నమూనా కింద పేర్కొన్నారు. ఇదే సూత్రాన్ని ఇతర శాఖలకూ వర్తింప చేయాలని భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్రపతి ఆమోదం తర్వాత ముఖ్య మార్పులు!
కొత్త జిల్లాలు వస్తున్నా కొత్తగా నియామకాలు చేపట్టాలన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సమావేశంలో ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. రానున్న కొత్త జిల్లాలకు తగ్గట్లు ప్రసుత రాష్ట్ర/జోనల్/జిల్లా వ్యవస్థలో రాష్ట్రపతి ఆమోదంతో మార్పులు తెచ్చేందుకు తగిన సమయం అవసరమైనందున ఈ లోగా ఉద్యోగులను అవసరమైన ప్రాంతానికి తాత్కాలిక పద్ధతిలో ‘ఆర్డర్ టు సర్వ్’ కింద సర్దుబాటు చేస్తారు. దీనివల్ల కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినప్పటికీ...కార్యకలాపాలకు అవరోధం ఏమి ఉండదని సంబంధిత వర్గాలు వివరించాయి.
పోస్టుల ఉన్నతీకరణతో..