employees meet CS:పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. స్నేహపూర్వక గవర్నమెంట్ అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు కన్నిటి మూటలే అయ్యాయని మండిపడ్డారు. ఉద్యమ కార్యాచరణను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని, ఇప్పటికీ పీఆర్సీ నివేదికను ఇవ్వలేదని విమర్శించారు. ఏడో తేదీలోగా సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ సమీర్ శర్మ హామీ ఇచ్చారని, జీపీఎఫ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఐదు పేజీల రిప్రజెంటేషన్ను ఉద్యమ కార్యాచరణ నోటీసు రూపంలో అందించామని ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు.
అక్టోబర్ నెలాఖరు నాటికి పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని సజ్జలే హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ప్రభుత్వానికి సహకరిస్తూన్నామని, 7 శాతం ఐఆర్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. పీఆర్సీ నివేదిక ఇచ్చి మూడేళ్లైనా విడతల వారీగా డీఏలు ఇస్తామన్నా జీతాల్లో 50 శాతం పెండింగులో పెడతామన్నా సహకరించామన్నారు. కరోనా సమయంలో 4-5 వేల మందికి ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని వాపోయారు. ఆర్ధికేతర సమస్యలను కూడా పరిష్కరించడం లేదని నిలదీశారు. చట్టబద్దంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవ్వరికీ లేదని తెల్చిచెప్పారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగుల కు భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటిందని అంతటి కీలకమైన పీఆర్సీ నివేదికను కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.