అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజాబాహుళ్యానికి అందుబాటులో లేకుండా నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం బాటలోనే ఏపీ పోలీసుశాఖ వెళుతోంది. చివరికి బదిలీ(transfers) చేసిన అధికారుల జాబితా కూడా విడుదల చేయకుండా గోప్యత పాటించడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన మీడియాకు విడుదల చేయాలంటే వాట్సప్ గ్రూపులో పంపిస్తుంటారు. కొన్నిసార్లు పీఆర్‌వోలు రిపోర్టర్లకు వ్యక్తిగతంగా సమాచారం ఇస్తారు. అయితే డీఎస్పీల బదిలీలు జరిగినప్పుడు మాత్రం వాటికి సంబంధించిన వివరాలేవి అధికారికంగా వెల్లడించట్లేదు. బదిలీ(transfers) అయిన అధికారుల జాబితా కూడా విడుదల చేయట్లేదు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 14 మంది డీఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ చేశారు. ఆ వివరాలేవి మీడియాకు విడుదల చేయలేదు. జరిగిన బదిలీలను కూడా అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మంగళగిరి, తుళ్లూరులకు కొత్త డీఎస్పీలు:
గుంటూరు జిల్లా మంగళగిరి డీఎస్పీగా జె.రాంబాబును నియమించారు. అక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న డి.దుర్గాప్రసాద్‌ను ఒంగోలు పీటీసీ డీఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరులోని ఎర్రచందనం కార్యదళంలో డీఎస్పీగా పనిచేస్తున్న వి.పోతురాజును రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు ఎస్‌డీపీవోగా నియమించారు. నిఘా విభాగంలో డీఎస్పీగా ఉన్న యూ.నర్సింగప్పను అనంతపురం జిల్లా గుంతకల్లు ఎస్‌డీపీవోగా, నెల్లూరు దిశ డీఎస్పీగా ఉన్న యూ.నాగరాజును ఒంగోలు ఎస్‌డీపీవోగా బదిలీ చేశారు. ఒంగోలు ఎస్‌డీపీవోగా ఉన్న కెవీవీఎన్‌వీ ప్రసాద్‌ను బదిలీ చేసి విజయవాడ సిటీస్పెషల్ బ్రాంచ్-1కు ఏసీపీ పోస్టు ఇచ్చారు. కృష్ణా జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా ఉన్న మోజేస్ పాల్‌ను గుంటూరు అర్బన్ సీసీఎస్ డీఎస్పీగా నియమించారు. నిరీక్షణలో ఉన్న మరో ఆరుగురికి సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, ఏసీబీ విభాగాల్లో డీఎస్పీలుగా పోస్టింగ్‌లిచ్చారు. ఒంగోలు పీటీసీ డీఎస్పీగా ఉన్న వి.శ్రీనివాసరావుకు పోస్టింగు ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:అద్దె భవనాల్లో కొనసాగినా ప్రవేశాలకు ఓకే