ఎటు చూసినా బహుళ అంతస్తుల ఆకాశ హర్మ్యాలు.. విశాలమైన రహదారులు.. అందమైన ఉద్యానవనాలు.. జల విహారానికి వీలుగా తీర్చిదిద్దిన కాలువలు.. అన్ని వర్గాల వారూ సుఖంగా, సౌఖ్యంగా నివసించే మహానగరం! విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నెలవు. ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచే ప్రజా రాజధాని. ఇదీ రెండేళ్ల క్రితం వరకూ అమరావతి గురించి రాష్ట్ర ప్రజలు కన్న కల! అది సాకారమవుతున్న దశలో రాజధాని పనులు అటకెక్కాయి! వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నప్పుడు 15 వేల మంది కార్మికులతో, వాహనాల రాకపోకలతో, విద్యుద్దీపాల వెలుగుల్లో రేయింబవళ్లు కళకళలాడిన అమరావతిలో.. ఇప్పుడు ఎటు చూసినా నీరవ నిశ్శబ్దం. అమరావతిని కాపాడుకోవడానికి 600 రోజులుగా ఎండనక, వాననక.. ప్రభుత్వ నిర్బంధాల్నీ, ఆంక్షల్ని, ఖాకీ బూట్ల పదఘట్టనల్ని, లాఠీ ఛార్జీల్ని భరించి, సహించి, ఎదురొడ్డి పోరాడుతున్న రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు, రైతులు కూలీల ఆక్రందనలు, ఉద్యమ నినాదాలు తప్ప అక్కడ ఎలాంటి శబ్దాలూ వినిపించడం లేదు.
రాజధానికి అవసరమైన భారీ భవనాల కోసం నిర్మించిన పునాదులు నెలల తరబడి నీళ్లలో నానుతూ తటాకాల్ని తలపిస్తున్నాయి. సగంలోనే పనులు ఆగిపోయి.. యుద్ధంలో క్షతగాత్రులైన సైనికుల్లా మిగిలిపోయిన బ్రిడ్జిలు.. ఇప్పటికే చాలావరకూ పూర్తయిన, వివిధ దశల్లో ఉన్న నివాస భవనాల ఆవరణల్లో అంతెత్తున పిచ్చిమొక్కలు.. నిలువెత్తు పెరిగిన తుమ్మచెట్ల మధ్య దీనంగా కనిపిస్తున్న రహదారులు.. భవనాల పునాదులు, బ్రిడ్జిలు, నివాస భవనాల నిర్మాణాల్ని నిలిపివేయడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడుతున్న ఇనుప చువ్వలు! చెదురుమదురుగా పడిన నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాలు.. దొంగల పాలవకుండా వాటికి కాపలా కాస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్న ఒకరో ఇద్దరో సెక్యూరిటీ గార్డులు..! ఇదీ ఇప్పుడు అమరావతి దీనస్థితి..!
అలుపెరగని పోరాటం
2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రకటన శరాఘాతంగా తగలడంతో.. ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా మొదలైన అమరావతి పరిరక్షణ ఉద్యమం ఆదివారంతో 600వ రోజుకు చేరుతోంది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురు నిలిచి, కరోనా మహమ్మారినీ తట్టుకుని, ఒక్కరోజు కూడా విరామం లేకుండా అమరావతి ప్రజలు ఉద్యమనినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ప్రతి దశలోనూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహిళలు... ఇప్పటికీ అదే స్ఫూర్తితో పోరాడుతున్నారు.
అమరావతి దైన్యస్థితికి అద్దం పట్టే దృశ్యాలివి...
అవును.. ఇది ప్రయోగశాల!
రూ.254 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఫోరెన్సిక్ ప్రయోగశాల దుస్థితి ఇది. నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. దీని నిర్మాణంలో వాడిన ఊచల్ని దొంగలు కోసుకుని వెళ్లిపోయారు.
నీళ్లలోనే రూ.300 కోట్ల పునాదులు!
10 మీటర్ల లోతు తవ్వి, అక్కడి నుంచి నాలుగు మీటర్ల మందంతో ర్యాఫ్ట్ ఫౌండేషన్ విధానంలో వేసిన... సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులు ఇవి. ఐదు భవనాల పునాదులకు రూ.300 కోట్ల వరకు ఖర్చయింది. ఒక్కో టవర్ పునాదికి 1500 టన్నుల ఉక్కు, కొన్నివేల ఘనపు మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. పనులు నిలిపివేయడంతో ఇవన్నీ తటాకాల్ని తలపిస్తున్నాయి. వీటికి సమీపంలోనే హైకోర్టు భవన నిర్మాణానికీ ర్యాఫ్ట్ పునాది వేశారు. రూ.30 కోట్ల వరకు ఖర్చయింది.
ప్రధాన మార్గం గేదెలకు ఆవాసం..!
రాజధాని అమరావతిలో కీలకమైన ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్ యాక్సెస్ రోడ్డు) ఇది. రూ.400 కోట్లకు పైగా అంచనా వ్యయంతో 8 వరుసలుగా దీన్ని నిర్మించారు. రాజధాని పనులు సగంలో నిలిచిపోవడంతో ఈ రహదారి పాక్షికంగానే వినియోగంలో ఉంది. దీన్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు... ఇలా గేదెల్ని కట్టేసుకోవడానికి వాడుకుంటున్నారు.
ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే..!