ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు సిబ్బందికి, అధికారులకు, వివిధ శాఖలకు చెందిన సిబ్బందికి డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ సమర్థవంతంగా ప్రణాళికలు రూపొందించారని అభినందించారు. కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేసేందుకు వచ్చిన వృద్ధులు, వికలాంగులకు పోలీసులు సహకారం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన కార్పొరేషన్, నగర పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలతో పోల్చుకుంటే ఈసారి తక్కువ జరిగాయన్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారిని ముందస్తు బైండోవర్ చేయడం, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక నిఘా పెట్టడంతో ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని గౌతం సవాంగ్ పేర్కొన్నారు.