కరోనా వైరస్ కట్టడి, లాక్డౌన్ వంటి అంశాలపై సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్ల పైకి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపారు. వైద్యులు, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సిబ్బంది అధికారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు . విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి వెంటనే ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారిని గుర్తించేందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్లు ,ఎస్పీలకు సూచించారు .
మీడియాపై ఆంక్షలు లేవు...
నిత్యావసరాల వస్తువుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచించారు. మెడికల్ షాపు లు, మెడిసిన్ మినహా నిత్యావసర వస్తువులు రాత్రి 8 గంటల తరువాత విక్రయానికి అనుమతి లేదన్నారు. పండుగలు, పార్టీలు, ఫంక్షన్ లు, వివాహాలు, విహారయాత్రలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు తెలపాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకై డయల్ 100, 104కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవని... ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.