రాష్ట్రంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని డీజీపీ స్పష్టం చేశారు. హౌజ్ క్వారంటైన్లో ఉన్నవారు బయటకు వస్తే కేసులు నమోదు చేయాలన్న ఆయన.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని పారద్రోలడానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీజీపీ సవాంగ్ అన్నారు.
నిబంధనలివే..
⦁ డాక్టర్లు, నర్సింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. అత్యవసర సేవలకు 100, 104 విరివిగా ఉపయోగించుకోవాలి.
⦁ వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులు, టూరిస్టులు కచ్చితంగా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. గోప్యత పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
⦁ పబ్లిక్, ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. సరుకులు రవాణా చేసే ప్రైవేటు వాహనాలకు మినహాయింపు ఉంటుంది.
⦁ నిత్యావసరాల వస్తువుల కోసం కుటుంబం నుంచి ఒక్కరికే అనుమతి. మెడికల్ షాపులు తప్ప మిగతా వాటికి రాత్రి 8 తర్వాత అన్నీ మూసివేయాలి.
⦁ ఒక కాలనీలో వాహనంపై రెండు లేదా మూడు కిలోమీటర్లు మించి ప్రయాణించరాదు.