సాధారణంగా.. ప్రభుత్వం రూపాయి ఖర్చు చేసినా.. బడ్జెట్‌లో కేటాయింపు ఉండాలి. సవరించిన బడ్జెట్ అంచనాల్లోనో.. కనీసం అనుబంధ పద్దులోనో... అందుకు సంబంధించిన వివరాలను శాసనసభ ముందు ఉంచి ఆమోదం పొందాలి. కానీ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలను.. ప్రభుత్వం సభామోదం లేకుండా ఖర్చు చేయడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో.. దాదాపు వందకు పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో.. 29 కార్పొరేషన్లు చాలా ఏళ్లుగా దాదాపు లక్ష కోట్ల రుణాలు తీసుకున్నాయి. వాటికి గ్యారంటీలు ఇస్తున్న ప్రభుత్వం.. ఆ నిధుల్లో సింహ భాగాన్ని తానే వాడుకుంటోంది. ఆ అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు బడ్జెట్‌లో కార్పొరేషన్లకు నిధులూ కేటాయిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆ వివరాలను శాసనసభ ముందుంచడం లేదు. ఈ నిధులను ఎక్కడ? ఎందుకు వినియోగించారో ‘మ్యాక్రో ఎకనామిక్స్ మెమోరాండం’లో స్పష్టంగా పేర్కొనడం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కార్పొరేషన్ల ద్వారా బడ్జెటేతర రుణాలను తీసుకుని వాడుకోవడం పరిపాటైందని, ఆ వివరాలేవీ శాసనసభ ముందు ఉంచకపోవడం బడ్జెట్ సూత్రాలకు విరుద్ధమని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ వ్యవహారం
రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల నుంచి పీడీ ఖాతాలకు చేరుతోంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో ఉన్న వందకు పైగా కార్పొరేషన్లలో సింహభాగం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అవి తీసుకువచ్చే రుణాలను ప్రభుత్వమే వాడుకుంటూ.. తిరిగి చెల్లించడానికి బడ్జెట్ నుంచి నిధులను కేటాయిస్తోంది. అసలు కార్పొరేషన్లకు ప్రభుత్వం ఏటా ఎందుకు బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది? ఆ వివరాలేవీ మ్యాక్రో ఎకనామిక్స్ మెమోరాండంలో చూపించడం లేదు. సభ ముందూ ఉంచడం లేదు. కార్పొరేషన్ల కార్యకలాపాలపై కాగ్‌లోని మెంబర్ ఆడిట్ బోర్డు చేయాల్సిన తనిఖీలూ.. సరిగా జరుగుతున్న దాఖలాలు లేవని చెబుతున్నారు.
ప్రతి ఖర్చుకూ సభామోదం తప్పనిసరి
రాష్ట్రంలో ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు వివరాలనూ శాసనసభ ముందుంచాలి. సభలో చర్చించి ఆమోదించాలి. కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాలకు సంబంధించిన ఖర్చునూ ఇలాగే సభ ముందుంచాలి’ అని ఆర్థిక వ్యవహారాల్లో అనుభవమున్న ఒక విశ్రాంత ఐఏఎస్ అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో కార్పొరేషన్లు ఏ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.
ఇటీవల కాలంలో ఒకసారి రాష్ట్ర బడ్జెట్టుకు శాసనమండలి ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు కూడా కొంత కాలం ఆగిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని ముఖ్యులే చెప్పారు. అలాంటిది కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న కోట్లాది రూపాయలను కేవలం ఉన్నతాధికారి స్థాయి ఆమోదంతోనే వినియోగించడం, ఆ వివరాలను సభ ముందుంచకపోవడం ఏ రకంగా సమర్థనీయమనే ప్రశ్న వస్తోంది.