రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 80 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1177కి పెరిగింది. గత 5 రోజుల్లో 3 సార్లు 80 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో అత్యధికం కృష్ణా జిల్లాలో నమోదు కాగా, గుంటూరు, కర్నూలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా తీవ్రత ఒక్కసారిగా ఉద్ధృతమైన కృష్ణా జిల్లాలోనే మరో 33 మంది వైరస్ బారిన పడ్డారు. గుంటూరు 23, కర్నూలు 13, నెల్లూరు 7, పశ్చిమ గోదావరి 3, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడ్డారు. 7 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల లోపు కొత్తగా 6517 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనా మరణాలు ఏవీ సంభవించలేదు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 235కి చేరింది.
కృష్ణా జిల్లాలో
కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ 177 కేసులు ఉండగా... కొత్తగా మరో 33 మంది బాధితులతో కేసులు 210కి పెరిగాయి. వరుసగా మూడో రోజూ జిల్లాలో భారీగా కేసులు నమోదు కావడం భయాందోళన రేపుతోంది. కరోనా కేసుల జాబితాలో కర్నూలు, గుంటూరు జిల్లాల తర్వాతి స్థానంలో కృష్ణా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందగా... 29 మంది వ్యాధి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లాలో మరో 23 మంది కరోనా బారిన పడగా... కేసుల సంఖ్య 237కి పెరిగింది. ఇప్పటివరకూ జిల్లాలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. వీటిలో నరసరావుపేట నుంచే 15 కేసులు నమోదయ్యాయి. వినుకొండ సమీపంలోని కొండ్రుముట్లలో ఒకటి, మిగిలినవన్నీ గుంటూరు అర్బన్ పరిధిలో బయటపడ్డాయి. జిల్లాలో 3 రోజుల్లో 31 కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. గుంటూరు తర్వాత నరసరావుపేటలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 78 పాజిటివ్ కేసులు నమోదు కాగా... మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో మరో 30 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేట, వరవకట్ట ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైరస్ నిర్ధారణ పరీక్షలను అధికారులు వేగవంతం చేశారు.