మూడు రాజధానుల విధానాన్ని ఖండిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు. సీఎం జగన్ ప్రతీకార చర్యలు పక్కకి పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. దిల్లీలో రాహుల్ గాంధీని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ ఉమన్ చాందీ, కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, ఎన్.తులసిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో బలం పుంజుకుంటాం
'పీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీని కలిశాను. కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ను బలోపేతం చేయాలని రాహుల్ గాంధీ మాకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ అంటే తనకు ఇష్టమని, ఎప్పుడు పిలిచినా రాష్ట్రానికి వస్తా అని రాహుల్ గాంధీ అన్నారు. కొన్ని కారణాల వల్ల మా ఓట్లు ఇతర పార్టీలకు పడిన మాట వాస్తవం. కానీ ఏపీలో మా కాంగ్రెస్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రాష్ట్రంలో ఏ పార్టీ చూసిన భాజపాతో కలిసేందుకు చూస్తున్నాయి. కాబట్టి భాజపాకు పూర్తి వ్యతిరేక పార్టీ కాంగ్రెసే. మళ్లీ బలం పుంజుకొని మా స్థానాన్ని తిరిగి మేమే భర్తీ చేసుకుంటాం' అని శైలజానాథ్ అన్నారు.
ఇదీ చదవండి:
ఏపీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజనాథ్ ప్రమాణం