జనవరి 16లోగా కొత్త వైద్య కళాశాలకు టెండర్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్యంలో నాడు-నేడుపై సమీక్షించిన ఆయన.... 16 వైద్య కళాశాలల్లో చేపట్టిని అభివృద్ధి పనులపై చర్చించారు. నిధుల సమీకరణ, టెండర్లు, జరుగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటికి రూ.17,300 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.
నవంబర్ 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందించాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఎవరైనా వైద్యం కావాలనుకుంటే.. ఆ రోగికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. హెల్త్ క్లినిక్స్ వచ్చేవరకు ఆరోగ్యశ్రీ రిఫరల్ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, పరిశుభ్రత విషయంలో ఏ మాత్రం రాజీపడొద్దని అన్నారు. ఇప్పుడున్న వైద్య కళాశాలల్లో 'నాడు-నేడు' పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్పారు. వాటికి పరిపాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరుచేయాలని అధికారులను ఆదేశించారు.