ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ 212వ సమావేశం జరిగింది. మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో నిధులకు కొరత లేకుండా బ్యాంకులు సహకరించాయని అభినందనలు తెలిపారు. ఆర్థిక రంగానికి వ్యవసాయం వెన్నుముక అని... రాష్ట్రంలో దాదాపు 62 శాతం ఆ రంగంపైనే ఆధారపడినందునే- రైతు సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చెల్లిస్తున్నామని.. ఖరీఫ్ ప్రారంభంలో రూ.7500, ఆ తర్వాత రబీ ప్రారంభం రూ. 4 వేలు, పంట చేతికొచ్చే సమయంలో మరో రూ.2 వేలు ఇస్తున్నామన్నారు. దీని వల్ల అర హెక్టారు, అంత కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఆ పెట్టుబడి దాదాపు సరిపోతుందని చెప్పారు.
సహకారం అందించండి: సీఎం జగన్
ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని...నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కోరిన 48 గంటల్లోనే రైతులకు ఇంటివద్దకే అందించేలా కియోస్క్‌లను అందుబాటులోకి తెచ్చామన్నారు. గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు, ఈ–క్రాపింగ్ చేస్తున్నారని... ఇది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తోందన్నారు. ఈ–క్రాపింగ్‌లో నమోదైన ప్రతి రైతుకు రుణాలు అందుతున్నాయా? లేదా అన్నది బ్యాంకర్లు చూడాలని కోరారు. ప్రతి గ్రామంలో గోదాములు, మండల కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయబోతున్నామని... రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం ప్రతి గ్రామంలో జనతా బజార్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాడు–నేడు చేపట్టామని.. దానికి కూడా బ్యాంకర్ల సహాయం చేయాలన్నారు. వచ్చే నెలలో జగనన్న తోడు పథకం అమలు చేయబోతున్నామని... వైయస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మహిళలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పూర్తిగా రూ.1100 కోట్లు పారిశ్రామిక రాయితీని అందించామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నింటికీ బ్యాంకర్ల మద్దతు ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు.
అండగా నిలుస్తాం...