ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్ - jagan on sc welfare latest news

అట్టడుగు వర్గాలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15వేల 735 కోట్లు, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం లో పాల్గొన్న సీఎం.. భవిష్యత్తులో ఎంత మందికి వీలైతే అంత మందికి మేలు జరగాలని అధికారులను ఆదేశించారు.

ap cm jagan sc welfare  meet
అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

By

Published : Jul 17, 2020, 4:16 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది. బడుగు, బలహీన వర్గాల ప్రయోజనం కోసం తీసుకోవాల్సిన మరిన్ని సంక్షేమ చర్యలపై సమావేశంలో చర్చించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. 2019–20లో ఎస్సీల కోసం రూ.11వేల 205.41 కోట్లు, ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేసినట్లు... ఈ ఏడాది కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 2018–19లో ఎస్సీల కోసం రూ.8వేల 903.44 కోట్లు ఖర్చు, ఎస్టీల కోసం రూ.2వేల 902.61 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. 77. 27లక్షల ఎస్సీలకు, 24.55లక్షల ఎస్టీలకు కలిపి మొత్తంగా 1.01 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.

స్వయం సాధికారితకు రెండు పథకాలు...

వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చిందని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు, వైఎస్సార్ చేయూత కింద దాదాపు 90 లక్షల మహిళలకు లబ్ధి చేకూరుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు జగన్ వెల్లడించారు. ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా...

విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం సహా... పార్కును వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14 అంబేద్కర్ జయంతి నాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పార్కు పనులు, విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ గా విభజించి వేగంగా పూర్తి చేయాలన్నారు. విజయవాడ నడిబొడ్డున 20 ఎకరాల్లో అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా పార్కును తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు.

ఇవీ చూడండి-ఆపరేషన్ ముస్కాన్: తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details