రాష్ట్రంలో అంగన్‌వాడీల్లోనూ నాడు - నేడు కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళా - శిశు సంక్షేమ సంక్షేమ శాఖపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, ఇతర అధికారులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి ఆదేశాలివే..
- పాఠశాలల్లో నాడు - నేడు కింద 9 రకాల సదుపాయాలు కల్పిస్తుండగా.. అదే తరహాలో అంగన్‌వాడీల్లోనూ అమలు చెయ్యాలి.
- ఫర్నీచర్, ఫ్యాన్లు, ఫ్రిజ్, తాగునీరు, మరుగుదొడ్లు, బ్లాక్ బోర్డులు, ప్రహరీగోడతో సహా ఇతర సౌకర్యాలు కల్పించాలి.
- అంగన్‌వాడీల అభివృద్ధికై విద్యాశాఖ అధికారులతో కలిసి పనిచేయాలి.
- అంగన్‌వాడీల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- దాదాపు 24 వేల అంగన్వాడీ భవనాల్లో అభివృద్ధి పనులపై అంచనాలు రూపొందించాలి.
- భవనాల్లేని చోట 31 వేల అంగన్‌వాడీల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలి.
- అంగన్‌వాడీలన్నీ ప్రీ స్కూల్ తరహా విధానంలోకి రావాలి.
- అంగన్‌వాడీల్లో గర్భిణీలు, తల్లులు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలి.
- పౌష్టికాహారం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలి.