గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ పురోగతి, గ్రామాల్లో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల అందజేతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించిన సీఎం.. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2023 మార్చి నాటికి గ్రామాలకు అన్ లిమిటెడ్ కెపాసిటీతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని , దీనికోసం అవసరమైతే కెపాసిటీని 20 జీబీ వరకు పెంచాలని ఆదేశించారు. అప్పుడే వర్క్ ఫ్రమ్ హోం సులభంగా సాధ్యమవుతుందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. మరో 31 లక్షల ఇళ్లు పెరుగుతాయని, ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
అందుకు అవసరమైన స్పీడ్ ఉండాలి...
తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో కూడా భూగర్భ కేబుళ్లు వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, గ్రామ సచివాలయం ఉన్న ప్రతీ చోటా వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీ ఉండాలన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గ్రామీణ లైబ్రరీల నిర్మాణం జరగాలని అవి పూర్తయ్యే సమయానికి అవసరమైనన్ని కంప్యూటర్లు కూడా సిద్ధం చేయాలన్నారు. డిజిటల్ లైబ్రరీలో న్యూస్ పేపర్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఒక్కో లైబ్రరీలో 6 సిస్టమ్స్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్నారు. అవసరం మేరకు 4 లేదా 6 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. గ్రామస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవసరమైన ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలన్నారు.
జనవరి 9న అమ్మఒడి పథకం..
వచ్చే ఏడాది జనవరి 9న అమ్మ ఒడి పథకం అమలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. అదే రోజున ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారికి వాటిని అందజేయాలన్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌పై ఆప్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ల్యాప్‌టాప్‌తో పాటు, గ్యారెంటీ, వారంటీ కార్డు, ఇంకా అన్ని ప్రమాణాలు చూపిస్తూ వాటిని ఇవ్వాలన్నారు. ల్యాప్‌టాప్‌ల సర్వీసు కూడా పక్కాగా ఉండాలన్నారు. ఎక్కడైనా ల్యాప్‌టాప్ చెడిపోతే దాన్ని గ్రామ సచివాలయంలో ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పారు. దాన్ని సర్వీస్ సెంటర్‌కు పంపించి, వారం రోజుల్లో తిరిగి తెప్పించాలన్నారు. కాబట్టి బిడ్ ఫైనల్ చేసేటప్పుడు, గ్యారెంటీ, వారంటీ, సర్వీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో తప్పనిసరిగా ల్యాప్‌టాప్‌ల సర్వీస్ సెంటర్లు ఉండాలన్నారు.
ఏర్పాట్లు జరుగుతున్నాయి...
గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లకు సంబంధించి, ఇప్పటికే కేబుల్ పనులు కొనసాగుతున్నాయని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వెల్లడించారు. ఇప్పటి వరకు 307 మండలాల్లోని 3642 గ్రామాల్లో 14,671 కిమీ మేర ఏరియల్ కేబుల్ వేశామని తెలిపారు. 690 చదరపు అడుగుల విస్తీర్ణంతో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తున్నామని, ఒక్కో లైబ్రరీ నిర్మాణ వ్యయం అంచనా 16 లక్షలు, కాగా, ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. ఇక అమ్మ ఒడిలో ఆప్షన్ ప్రకారం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి ఇప్పటికే విద్యార్థుల నుంచి ఆప్షన్ తీసుకుంటున్నామని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. రెండు మోడళ్లలో ల్యాప్‌టాప్‌లు సేకరిస్తున్నామన్న ఆయన, ఇంజనీరింగ్ విద్యార్థులకు హైఎండ్ వర్షన్ ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి
కరోనా విజృంభిస్తున్న వేళ మన ఆహార ప్రణాళిక ఎలా ఉండాలంటే..