కువైట్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్‌కు ఈ మేరకు సీఎం లేఖ రాశారు. వలస కార్మికుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆ మిషన్ ప్రశంసనీయం
విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘'వందే భారత్’ మిషన్' పేరుతో కేంద్రప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది భారతీయులు దీన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారని తెలిపారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకున్న వేలాది వలస కార్మికులు స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని.. వారంతా వచ్చేందుకు అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని లేఖలో వివరించారు. కువైట్‌లో కనీస సదుపాయాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.