సీబీఐ కేసుల తరువాత ఈడీ కేసుల విచారణ చేపట్టాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ/ఈడీ కోర్టు జనవరి 11న కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని హైకోర్టులో సవాలు చేయనున్నామని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సీబీఐ కోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టాలు వేర్వేరని, అందువల్ల సీబీఐ కేసుతో సంబంధం లేకుండా ఈడీ కేసుపై విచారణ చేపట్టవచ్చని సీబీఐ కోర్టు తీర్పుఇచ్చిన విషయం విదితమే.
అంతేగాకుండా రెండు కేసులనూ ఒకేసారి విచారణ చేపట్టాలన్న జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరుల అభ్యర్థనలనూ తోసిపుచ్చింది. సీబీఐ కేసు తేలేదాకా ఈడీ కేసు విచారణ నిలపాల్సిన అవసరం లేదంటూ ఈడీ సమర్పించిన పలు తీర్పుల నేపథ్యంలో నిందితుల పిటిషన్‌లను కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూధన్‌రావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈడీ కేసును ప్రత్యేకంగా విచారించవచ్చంటూ ఈ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బుధవారం హైకోర్టులో అప్పీలు దాఖలు చేయనున్నామని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది చెప్పడంతో తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు.