ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 28 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 24 బీసీ కార్పొరేషన్లు ఉండగా మరో 28 ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పెంపుతో రాష్ట్రంలో 139 బీసీ కులాలకు సంబంధించి.. 52 కార్పొరేషన్లు పని చేయనుండగా... ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లను భర్తీ చేయాలని సీఎం చెప్పారు. కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన జగన్.... జనాభా, వారి స్థితిగతులను ప్రాతిపదికగా తీసుకుని.. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై చర్చించారు. సమగ్ర అధ్యయనం చేసి.. మొత్తం 52 కార్పొరేషన్లు ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.
7 నుంచి 12 మంది డైరెక్టర్లు
ప్రతి కార్పొరేషన్‌లో.. 7 నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కులాల అభివృద్ధి కోసం కష్టపడేవారికి పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. ఆయా కార్పొరేషన్లు... తమ పరిధిలోని బీసీలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా.... లేదా అనే అంశాన్ని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.