బియ్యం కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులపై పౌర సరఫరాలశాఖ దృష్టి పెట్టింది. విచారించి చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసింది. కార్డుల్ని రద్దు చేయడంతోపాటు.. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంబంధిత ఉద్యోగుల జాబితాలను మండలాల వారీగా ఆయా తహసీల్దార్లకు పంపింది. రాష్ట్రంలో 1.49 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులున్నాయి. ప్రతి నెలా కొత్త కార్డులు జారీ చేస్తున్నా.. ఇప్పటికే కార్డులున్న వారిలో నిజంగా ఎంతమంది అర్హులనే విషయమై పౌర సరఫరాలశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే మొత్తం 90వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులున్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12వేలు, చిత్తూరు జిల్లాలో 11వేల మందికి పైగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రేషన్ తీసుకుంటున్నారు. వీరిలో ఏలూరులో 754, తాడేపల్లిగూడెంలో 429 కుటుంబాలున్నాయి. మిగిలిన మండలాల్లోనూ 100 నుంచి 400 వరకు కార్డులున్నాయి. ఇలాగే ప్రతి జిల్లాలోనూ 6వేల నుంచి 9వేల వరకు కుటుంబాలు.. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు కొనసాగించుకుంటున్నారు.
ఉద్యోగుల కుటుంబాలే ఎక్కువగా..
రేషన్ కార్డుల జారీ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదనే నిబంధన ఉంటుంది. అయితే రాష్ట్రంలో గుర్తించిన 90వేలకు పైగా కార్డుల్లో.. ఇటీవల గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారి కుటుంబాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత పెరిగిన వారి సంవత్సర ఆదాయం దృష్ట్యా కార్డును వెంటనే సరెండర్ చేయాలి. దీనికి సంబంధించిన పత్రాలనూ పౌర సరఫరాలశాఖ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్ ద్వారా అవకాశం కల్పించింది. వీరితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేసే మరికొందరు బియ్యం కార్డు ప్రయోజనాలను పొందుతున్నారు.