ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ

By

Published : Nov 4, 2019, 4:22 PM IST

Updated : Nov 4, 2019, 7:14 PM IST

రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ అయ్యారు. తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎల్వీ సుబ్రమణ్యం

రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఈ ఆదేశాలు జారీ చేశారు. సుబ్రమణ్యాన్ని బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణం తన బాధ్యతలను సీసీఎల్‌ఏకు అప్పగించాలని ఆదేశించారు. 1983 బ్యాచ్​కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యానికి మరో ఐదు నెలల 26 రోజుల సర్వీసు ఉంది. ఇంకా పదవీకాలం ఉండగానే ఆయన్ను బదిలీ చేశారు.

ఆ వివాదం జరుగుతుండగానే..
కొన్ని రోజుల క్రితం పరిపాలన నియామవళి ఉల్లంఘించారన్న కారణంతో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ జీవన సాఫల్య పురస్కారాలు, గ్రామ న్యాయాలయాలకు సంబంధించిన దస్త్రాలను మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకునే విషయంలో నియమాలు అతిక్రమించారని ఈ తాఖీదులు పంపారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన నియమావళి ఉల్లంఘించారంటూ సీఎస్ ఎల్‌వీ సుబ్రమణ్యం నవంబరు 1న వీటిని జారీ చేశారు. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళి-1968ని ఉల్లంఘించి తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని, ఒక సీనియర్​ స్థాయికి తగనిరీతిలో వ్యవహరించారని ప్రస్తావించారు. వీటన్నింటినీ ఎందుకు ఉల్లంఘించారో... వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివాదం నడుస్తుండగానే సీఎస్ బదిలీ కావటం చర్చనీయాంశమైంది. ఎవరికైతే సీఎస్ నోటీసులు ఇచ్చారో ఇప్పుడు ఆ అధికారి పేరుతోనే ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.

తరువాత ఎవరు?
ప్రస్తుతం ఎల్వీ సుబ్రమణ్యం తన బాధ్యతల్ని సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్​కు అప్పగించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా కేంద్రంలో డెప్యుటేషన్​పై పని చేస్తున్న 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు నీలం సహానీ, అజయ్ సహానీతో పాటు కార్పొరేట్ అఫైర్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్​ జనరల్​గా ఉన్న 1985 బ్యాచ్​కు చెందిన సమీర్ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి.

Last Updated : Nov 4, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details