రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 48వ రోజూ ఉద్ధృతంగా సాగాయి. తుళ్లూరు, మందడంలో మహాధర్నా కొనసాగించగా... వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. సోమవారం నాడు... రైతులు, మహిళల దీక్షలకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా, రైతు, యువజన సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. భాజపా నేత కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరాలవు, నెట్టం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య రైతులకు మద్దతుగా... మందడంలో దీక్షలో కూర్చున్నారు. తుళ్లూరులో యువజనులు, రైతులు 50 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా... తమ పోరాటం ఆగదని రైతులు, మహిళలు హెచ్చరించారు.
మూడు రాజధానులు వద్దు : కాంగ్రెస్
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, భారీ సంఖ్యలో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... నల్ల బెలూన్లు ఎగురవేశారు. తెదేపా నేతలు దేవినేని ఉమ, బొండా ఉమ, వంగవీటి రాధ, గద్దె అనురాధ, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ... ఐకాసకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. మూడు రాజధానులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని పీసీపీ అధ్యక్షుడు శైలజానాథ్ దిల్లీలో అన్నారు.
రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... రాజకీయేతర ఐకాస నేతలు గుంటూరులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించి, ఆ పత్రాలను రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌కు పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి :'అమరావతి నుంచి ఆ కార్యాలయాలను ఎలా తరలిస్తారు..?'