ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నత్త నడకలో అమరావతి నిర్మాణాలు

భారీ యంత్రాలతో శ్రమసైనికుల నిరంతర పని, నిర్మాణ సామాగ్రి తరలింపు యంత్రాల తాకిడి, వేలాది కూలీలు.... అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా కొన్ని నెలల క్రితం వరకూ కనిపించిన దృశ్యాలు. కానీ తాజా పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయి జనసంచారం లేకుండా రాజధాని బోసిపోతుంది. గత ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన పలు నిర్మాణాలు, వాస్తవ పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Ap capital construction works in bad condition
నత్త నడకలో అమరావతి నిర్మాణాలు

By

Published : Nov 29, 2019, 6:14 AM IST

నత్త నడకలో అమరావతి నిర్మాణాలు
ప్రకృతి సోయగాల నడుమ సుందర రాజధాని పనులు ఒకప్పుడు రేయింబవళ్లు నిరంతరాయంగా కొనసాగుతుండేవి. ఎక్కడ చూసినా...రిగ్‌లు, క్రేన్లు, పొక్లెయినర్ల శబ్ధాలు ప్రతిధ్వనించేవి. నిర్మాణాలలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందరినీ అశ్చర్యపరిచేవి. షియర్‌వాల్‌ టెక్నాలజీతో గోడలు, శ్లాబ్‌ సహా ఒక అంతస్తు మొత్తాన్ని వారం రోజుల్లోనే నిర్మించే యంత్రాంగం ఉండేది. అందుకనుగుణంగానే గత ప్రభుత్వం.. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగులు, భూమిలేని నిరుపేదల కోసం అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు చేపట్టింది. అనుకున్న విధంగా పనులు జరిగి ఉంటే ఈ ఏడాది ఆగస్టు నాటికి రాజధాని నిర్మాణాలు పూర్తిఅయ్యేవి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది.

ప్రజాప్రతినిధుల కోసం భవనాలు

ప్రజాప్రతినిధుల కోసం నిర్మించతలపెట్టిన ఆవాసాలలో.. ఒక్కో టవర్ జీ ప్లస్ 12 కింద మొత్తం 12 టవర్ల నిర్మాణం 2017 నవంబర్​లో చేపట్టారు. మొత్తం 288 ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఒక్కొక్కటీ 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. తెదేపా అధికారం కోల్పోయే సమయానికి దాదాపు 80 శాతం నిర్మాణపనులు పూర్తయ్యాయి. పదిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు. గత ఆరు నెలల నుంచి పనులు నిలిచిపోయాయి.

అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలు

ఇదే పరిస్థితి... అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తోన్న భవనాల్లోనూ కనిపిస్తోంది. సివిల్ సర్వీసుల అధికారుల కోసం 5.3 ఎకరాల విస్తీర్ణంలో ఆరు టవర్లలో 144 ప్లాట్లు నిర్మిస్తున్నారు. దాదాపు 90 శాతం పనులు గత ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. మిగిలిన పదిశాతం పనుల్లో మాత్రం గత ఆరునెలలుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

నాన్​గెజిటెడ్, ఇతర ఉద్యోగుల ఫ్లాట్ల నిర్మాణాలు

నాన్‌గెజిటెడ్‌ అధికారులు కోసం 27.47 ఎకరాల్లో 21 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిలో మొత్తం 1,995 ప్లాట్లు నిర్మాణమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో టవర్ 10 అంతస్తుల వరకు వచ్చింది. గెజిటెడ్‌ అధికారులకు రెండు కేటగిరీలుగా 1500 చదరపు అడుగుల్లో, 1800 చదరపు అడుగుల్లో నివాస సముదాయాలు చేపట్టారు. వీటి సమీపంలో నాలుగో తరగతి ఉద్యోగులకు 3860 పైగా ప్లాట్ల నిర్మాణాలకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి వీటి నిర్మాణం దాదాపుగా 75 శాతం పూర్తైంది. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు.

నీరు పేదల ఇళ్లు

రాజధాని ప్రాంత గ్రామాల్లోని భూమిలేని నిరుపేదలకు నివాస గృహాలు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అందుకుగాను మొత్తం ఎనిమిది చోట్ల నిర్మాణాలు చేపట్టింది. తొలి దశలో 5024 ఫ్లాట్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో మరో 3 వేల ఫ్లాట్లు మంజూరు చేశారు. జీ ఫ్లస్ 3 విధానంలో చేపట్టిన ఈ నిర్మాణాల్లో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కేటగిరీలుగా విభజించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయం నాటికి కొన్ని నిర్మాణాలు దాదాపు 60 శాతం, మరికొన్ని దాదాపు 75శాతం వరకూ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ నిర్మాణాలలో ఎలాంటి పురగోతికి నోచుకోలేదు.

మంత్రులు బంగ్లాలు

ఇతర నిర్మాణాల విషయానికొస్తే దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో మంత్రులు, సీనియర్‌ అధికారులు, జడ్జిల కోసం 186 బంగ్లాల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో మంత్రులకు 35, హైకోర్టు న్యాయమూర్తులకు 36, ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కేబినెట్‌ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులు, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు 115 బంగ్లాలు ప్రతిపాదించింది. మూడు చోట్ల ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఏడాది జూన్ నాటికి ఇవి 12 నుంచి 30శాతం వరకూ పూర్తయ్యాయి. ఆ తర్వాత వీటి నిర్మాణ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదన్నది వాస్తవ దృశ్యం.

ఇదీ చదవండి :

'అమరావతి జోలికి రావొద్దు... రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి'

ABOUT THE AUTHOR

...view details