సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడు గంటలపాటు జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాపు మహిళలకు ఆర్థిక సాయమందించే 'కాపు నేస్తం' పథకాన్ని క్యాబినెట్ ఆమోదించింది. దీనికి 1,101 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు నిర్ణయానికి ఆమోదం లభించింది. వైఎస్‌ఆర్ నవశకం సర్వేపైనా మంత్రులు చర్చించారు. సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి సర్కారు ఆమోద ముద్ర వేసింది. ఆదాయం, భూమి, విద్యుత్ వినియోగం నిబంధనల్లో మార్పునకు మంత్రులు అంగీకారం తెలిపారు.
జగనన్న దీవెన పథకాలకు నిధులు
జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.2300 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400 కోట్లు ఖర్చుచేయనున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ వీరికే
- ఏడాదికి కుటుంబానికి 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు.
- రైతులకు 10 ఎకరాల లోపు మాగాణి, లేదా 20 ఎకరాల మెట్ట భూమి ఉన్నా అర్హులుగా ఉంటారు.
- ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పారిశుద్ధ్య పని చేసే వారి పిల్లలు, ఆటో, టాక్సీ డ్రైవర్ల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అధికారుల కమిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. జూన్ 30, 2020 లోగా దీనిపై కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సీపీఎస్ రద్దుపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీకి సహాయంగా ఉండేందుకు అధికారులను నియమించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఈ నివేదిక మార్చి30, 2020 లోగా అందనున్నట్లు పేర్ని నాని తెలిపారు.
గ్రామాల్లో 10 వేలు, పట్టణాల్లో 12 వేలు
కొత్త బియ్యం కార్డులు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బియ్యం కార్డులకు నెలకు రూ.10 వేల ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు ఆదాయం ఉన్న వారిని అర్హులని మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్డుల ముద్రణ పౌర సరఫరాల శాఖ చేపడుతుందని... దీని కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం అంగీకారం తెలిపింది.
డిసెంబరు 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కేబినెట్ ఆమోదం తెలియచేసింది. పేదలందరికీ ఇళ్లు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ కు డిసెంబరు 26వ తేదీన శంకుస్థాపన చేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది. కడప ఉక్కు కోసం కావాల్సిన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకోవాలని కేబినెట్ తీర్మానించింది.
'కాపు నేస్తం' పథకానికి కేబినెట్ ఆమోదం