మహిళా భద్రత కోసం కఠిన చట్టానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని దిశ యాక్ట్ పేరిట అమలు చేయనున్నారు. అత్యాచారానికి పాల్పడినా... చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినా మరణశిక్షే విధించేలా... నిర్ధరించే ఆధారాలు ఉన్నప్పుడు 21రోజుల్లో తీర్పు వచ్చేలా బిల్లుకు ఆమోదం తెలిపింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు, అత్యాచారం, యాసిడ్ దాడి, వేధింపుల కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి.
అక్రమ మద్యం తయారు చేస్తే కఠిన శిక్షలు
రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భాగంగా... అసలైన అసైన్‌దారుల నుంచి భూమి కొనుగోలు చేసి ఇచ్చినవారికి.... గత ప్రభుత్వం కేటాయించిన నివాస, వాణిజ్య స్థలాల కేటాయింపును మంత్రివర్గం రద్దు చేసింది. గత ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందని అభిప్రాయపడిన కేబినెట్... అసలైన అసైనీలకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించింది. అక్రమంగా మద్యం తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా... కఠిన శిక్షల అమలుకు ఉద్దేశించిన ముసాయిదానూ మంత్రివర్గం ఆమోదించింది. బెయిల్‌కు అర్హత లేని నేరాలుగా పరిగణించి... 6 నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. మొదటిసారి పట్టుబడితే 2 లక్షలు, రెండోసారి పట్టుబడితే 5 లక్షల జరిమానా విధిస్తారు. బార్లలో అక్రమాలకు పాల్పడితే... లైసెన్సు ఫీజు కంటే రెండింతలు జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే లైసెన్సు రద్దవుతుంది.
మంత్రివర్గ వివరాలను వెల్లడిస్తున్న హోం మంత్రి కేసుల ఉపసంహరణ..!
గంటపాటు సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో... కొన్ని రకాల కేసుల ఉపసంహరణపైనా నిర్ణయాలు తీసుకున్నారు. తుని ఘటన సహా.... కాపు ఉద్యమంలో పెట్టిన అన్ని కేసులనూ ఎత్తివేయాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లా భోగాపురం భూ సేకరణ ఘటనలోనూ నమోదైన కేసుల ఉపసంహరణకూ కేబినెట్ అంగీకరించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు... వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణకు కొత్త శాఖ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ విలీనం సహా... 51 వేల 488 మందితో ప్రజారవాణా శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
తెలుగు తప్పనిసరి...
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తుండగా... తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల చట్టంలోనూ సవరణలకు సమ్మతి తెలిపిన మంత్రివర్గం... కడప జిల్లాలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఏర్పాటును ఆమోదించింది. కర్నూల్లోసిల్వర్ జూబ్లీ కళాశాల, కెవిఆర్, ప్రభుత్వ కళాశాలలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్సీటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం కమిషన్ ఛైర్‌పర్సన్‌గా.... వంగపండు ఉష నియమకానికి మంత్రివర్గం సమ్మతి తెలిపింది.
ఇదీ చదవండి :పీఎస్ఎల్వీ-సీ 48 ప్రయోగం విజయవంతం