ప్రభుత్వ పాలసీలపై నిరాధార వార్తలు.. కథనాలపై రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకొచ్చింది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ టేబుల్ ఐటెంగా ఉంచిన ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థపై పరువు నష్టం కేసులు వేయాలని సంబంధిత విభాగాలకు మంత్రిమండలి సూచించింది. గతంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ద్వారా సదరు ప్రచురణ సంస్థకు రీజాయిండర్లు పంపిన ప్రభుత్వం ఇక సంబంధిత విభాగాల అధిపతులకే ఈ అధికారాలు అప్పగించింది.
ఈ వ్యవహారాలకు సంబంధించి 2007, ఫిబ్రవరి 20 తేదీన అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 938 ని అమలుకు నిర్ణయం తీసుకుంది. దురుద్దేశ పూర్వకంగా ప్రసారం లేదా ప్రచురణ చేశారని భావిస్తే 24గంటల్లోపు సదరు సంస్థ పై కోర్టుల్లో కేసులు వేయాల్సిందిగా సూచించింది. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల కమిషనర్‌కూ ఈ తరహా కేసులు వేసేందుకు అధికారాలు కల్పించింది.