రాష్ట్రవ్యాప్తంగా సుబాబుల్ రైతుల సమస్యలపై మంత్రుల ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఈ అంశంపై సచివాలయంలో చర్చించింది. సుబాబుల్‌ను అవసరమైతే ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని కమిటీ స్పష్టం చేసింది.
'అవసరమైతే సుబాబుల్‌ను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది' - ఏపీ తాజా వార్తలు
రవాణాదారులు, ట్రేడర్ల దయాదాక్షిణ్యాలపై రైతులు పంట విక్రయించుకునే పరిస్థితి ఉండకూడదని మంత్రుల ఉపసంఘం అభిప్రాయపడింది. కొన్ని పేపరు కంపెనీలు ట్రేడర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నాయని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.
మార్కెటింగ్‌లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని రైతు నుంచి కంపెనీలు నేరుగా కొనుగోలు చేయడం లేదని తెలిపింది. రాష్ట్రంలో 66 వేల మంది రైతులు 1.20 లక్షల ఎకరాల్లో సుబాబుల్, యూకలిప్టస్, ఇతర కాగితపు గుజ్జు కలపను సాగు చేస్తున్నారని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో యూకలిప్టస్... కృష్ణ, గుంటూరు జిల్లాలో సుబాబుల్ ఎక్కువగా సాగు చేస్తున్నారని.. గతంలో నేరుగా పేపర్ మిల్లులే సుబాబుల్, యూకలిప్టస్ కొనుగోలు చేసేవని ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిటీ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 175 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోందని.. డిమాండ్ కన్నా ఎక్కువ ఉత్పత్తి కావటం వల్ల రైతులు నష్టపోతున్నారని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది. ఈ-క్రాప్ బుకింగ్ ద్వారా దీన్ని నియంత్రించాల్సి ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చివరి వరకు పోరాడింది: సజ్జల