ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు! - రాజధాని వివాదం

మూడు రాజధానులు ఉండాలంటూ ప్రతిపాదించిన జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ap cabinet meeting
కేబినేట్ భేటీ

By

Published : Dec 27, 2019, 1:52 AM IST

Updated : Dec 27, 2019, 4:31 AM IST

నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!

రాజధాని తరలింపు ప్రతిపాదనలతో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్న వేళ....కేబినెట్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. రాజధానిపై ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్‌ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కమిటీ చేసిన సిఫార్సుల మేరకు మూడు రాజధానుల అంశాన్ని మంత్రి మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలు కేబినెట్​లో చర్చకు రానున్నాయి. ప్రత్యేకించి రాజధాని రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

చర్చకు రానున్న మరికొన్ని కీలకాంశాలు

కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర వర్తిస్తున్న పంటలు మినహా ఇతర పంటలకు మద్దతు ధర కల్పించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ) ద్వారా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్‌​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు సీఆర్డీఏ ప్రాంతంలో ఐఏఎస్ అధికారులు కొనుగోలు చేసిన ఫ్లాట్లకు సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై కూడా రాష్ట్ర మంత్రివర్గం సమాలోచనలు చేయనుంది.

పటిష్ఠ భద్రత ఏర్పాటు

కేబినెట్‌ భేటీ వేళ సచివాలయంతో పాటు రాజధాని గ్రామాల్లో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. సచివాలయంలో కేబినెట్‌ భేటీతో రైతుల నుంచి నిరసనలు రావచ్చన్న నిఘావర్గాలు సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లతో తనిఖీలు నిర్వహించి వాహనరాకపోకలను నియంత్రించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:'రాజధానిపై నేడు కీలక నిర్ణయం'

Last Updated : Dec 27, 2019, 4:31 AM IST

ABOUT THE AUTHOR

...view details