ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం... ప్రధాన అజెండా ఇదే - ఏపీ మంత్రివర్గ సమావేశం

స్థానిక సంస్ధల ఎన్నిక‌ల నిర్వహ‌ణతో పాటు ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాల కేటాయింపు అంశాలే ప్రధాన అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించటంతో ప్రభుత్వం ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపైనా ఈ సమావేశంలో సమాలోచనలు చేయనున్నారు.

cm jagan latest images
cm jagan latest images

By

Published : Mar 4, 2020, 5:06 AM IST

Updated : Mar 4, 2020, 5:12 AM IST

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. పురపాలికలకు సమీపంలోని పంచాయతీల విలీనం, కొత్త పంచాయతీల ఏర్పాటు తదితర అంశాలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్ల కుదింపుపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న గణాంకాల ప్రకారం బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం మేర రిజర్వేషన్లు ఖరారు చేశారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు 24.15 శాతానికే పరిమితం చేయాల్సి ఉంది. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

బడ్జెట్ సమావేశాలపై చర్చ

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలా?... లేక స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందుగానే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేయాలా? అన్నదానిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్‌, పదోతరగతి పరీక్షలు, స్థానిక ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు ఒకేసారి నిర్వహించాల్సి రావటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఎన్​పీఆర్​పై తీర్మానం?

జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్) అంశంపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. శాసనసభలో తీర్మానం పెట్టే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఉగాది నాడు ఇవ్వనున్న ఇళ్లపట్టాలకు సంబంధించిన అంశంలోనూ కేబినెట్​లో కీలకంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

ఎన్​పీఆర్​ నిబంధనలతో మైనారిటీల్లో అభద్రత: సీఎం జగన్

Last Updated : Mar 4, 2020, 5:12 AM IST

ABOUT THE AUTHOR

...view details