ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డ్వాక్రాకు ఆసరా'.. 'డిసెంబర్ 1 నుంచి ఇంటి వద్దకే బియ్యం'.. - ఏపీ రాష్ట్రమంత్రివర్గ నిర్ణయాలు న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ ఆసరా పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకులకు బకాయిపడ్డ రుణాల మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో 4 విడతలుగా జమ చేయనుంది. దీని ద్వారా 9,33,180 సంఘాలకు చెందిన సుమారు 90 లక్షల మంది సభ్యులకు రూ.27,169 కోట్ల లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,792.21 కోట్లను ఈ పథకానికి వెచ్చిస్తారు. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. దానిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. క్లస్టర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.730 కోట్లు వెచ్చించనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విలేకర్లకు తెలిపారు.

ap cabinet decisions
ap cabinet decisions

By

Published : Aug 20, 2020, 5:41 AM IST


జగనన్న విద్యాకానుక పథకాన్ని సెప్టెంబరు 5న ప్రారంభిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 42.34 లక్షల మంది విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్‌, స్కూల్‌ బ్యాగ్‌ అందజేస్తారు. ప్రభుత్వం ఇందుకోసం రూ.648.09 కోట్లు వెచ్చించనుంది.
* గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని, 77 గిరిజన మండలాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాన్ని సెప్టెంబరు 1న ప్రారంభిస్తారు. గర్భిణులు, బాలింతలకు 6 నుంచి 36 నెలల వరకు, మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తారు. గతంలో రక్తహీనతతో ఉన్న గర్భిణులు, బాలింతలకు మాత్రమే పౌష్టికాహారం అందజేయగా..ఇప్పుడు బాలింతలు, గర్భిణులందరికీ అమలు చేయనున్నారు. దీనిపై ప్రభుత్వం రూ.1,863 కోట్లు ఖర్చు చేస్తుంది. 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. గత సర్కారు ఈ కార్యక్రమానికి రూ.762 కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని మంత్రి తెలిపారు.

  • లబ్ధిదారుల ఇళ్లకే బియ్యం

  • లబ్ధిదారులు తినగలిగే, నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి రాష్ట్రమంతా ప్రవేశపెట్టనున్నారు. మట్టి, రాళ్లు లేకుండా, నూకలు 15 శాతానికి మించని సార్టెక్స్‌ చేసిన బియ్యాన్ని ఇస్తారు. సార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోటు,్ల ఇంటింటికీ పంపిణీకి రూ.296 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది. పర్యావరణహితంగా, పునర్వినియోగానికి అవకాశమున్న 10 కిలోలు, 15 కిలోలు పట్టే సంచుల్లో బియ్యం సరఫరా చేస్తారు. లబ్ధిదారుల ఇంటి వద్దే ఎలక్ట్రానిక్‌ కాటాపై తూకం వేసి అందజేస్తారు. బియ్యం సరఫరా కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువకులకు 9,260 వాహనాల్ని 60 శాతం రాయితీపై అందజేస్తారు. వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారు సమకూర్చుకోవాలి. 30 శాతం ప్రభుత్వ హామీపై బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఆరేళ్లలో బ్యాంకు రుణం తీరిపోయి వాహనం వారి సొంతమవుతుంది. ఇంటింటికీ బియ్యం సరఫరా చేసినందుకు వారికి నెలకు రూ.10 వేల చొప్పున ఆదాయం లభించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తుంది.
    సొంతంగా వైఎస్సార్‌ బీమా


రాష్ట్రంలో బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. 18-50 ఏళ్ల మధ్య వ్యక్తి సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ.5 లక్షలు ఇస్తారు. 51- 70 ఏళ్ల వయసు వ్యక్తి ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ.3 లక్షలు పరిహారం అందుతుంది. ఈ పథకంపై ప్రభుత్వం రూ.583.5 కోట్లు ఖర్చు చేస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం పీఎంజేజేవై పథకం కింద సగం మొత్తం (రూ.396 కోట్లు) అందజేసేదని మంత్రి తెలిపారు. కేంద్రం ఆ పథకాన్ని రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో అమలు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు.

  • కొత్తగా డివిజనల్‌ అభివృద్ధి అధికారులు


రాష్ట్రంలో డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల పేరుతో 51 కొత్త పోస్టులు సృష్టించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ‘పంచాయతీరాజ్శాఖలో ఎంపీడీవోలుగా నియమితులైనవారు పదోన్నతులకు అవకాశం లేక, పదవీ విరమణ వరకు అదే పోస్టుల్లో ఉంటున్నామని.. న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నారు. వారికి పదోన్నతులకు వీలు కల్పించేందుకు కొత్తగా డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి వివరించారు.

  • 101 శాతం విస్తీర్ణంలో సాగు


రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లోనూ వర్షాలు బాగా పడ్డాయని, డ్యామ్‌లన్నీ నిండుతున్నాయని మంత్రి నాని తెలిపారు. శ్రీశైలం నిండిందని, రెండు మూడు రోజుల్లో నాగార్జునసాగర్‌ కూడా నిండుతుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో తప్ప రాష్ట్రమంతా సాధారణం, అంతకంటే ఎక్కువగా వర్షాలు పడ్డాయన్నారు. దీంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 101 శాతానికి చేరినట్టు తెలిపారు.

  • నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం

2020-23 సంవత్సరానికి రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కుల్లో ఒకటి రాష్ట్రానికి వచ్చేలా కృషి చేయాలని నిర్ణయింది. దీని కోసం ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీబీడీఐసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన నోట్‌లో ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కును తూర్పుగోదావరి జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ పార్కు ఏర్పాటైతే రానున్న ఎనిమిదేళ్లలో రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల విలువైన విక్రయాలు జరుగుతాయని అంచనా వేస్తున్నామని తెలిపింది.
* భావనపాడు పోర్టు నిర్మాణానికి రైట్స్‌ సంస్థ రూపొందించిన డీపీఆర్‌కు ఆమోదం. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,669.95 కోట్లు.
* విశాఖ జిల్లా దిగువ సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక్కొక్కటి 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు కొత్త యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం. అంచనా వ్యయం రూ.510 కోట్లు.
* ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్‌-2006 సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం.

ఇదీ చదవండి: కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details