రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా కింద ఈ నెల 29న రైతులు, కౌలు రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనుంది. నివర్ తుపాను బాధితులకు పెట్టుబడి రాయితీని కూడా అదే రోజు అందజేయనుంది. సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. కొవిడ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు ‘రీస్టార్ట్ ప్యాకేజీ’ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూపొందించిన కొత్త విధానానికీ ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకర్లకు వెల్లడించారు.
ముఖ్యాంశాలు
* ప్రభుత్వం రైతు భరోసా కింద ఇది వరకు ఒక్కో రైతు ఖాతాలో రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. ఇప్పుడు మూడో విడతలో మొత్తం రూ.1,009 కోట్లు అందజేస్తుంది. దీనివల్ల 50.47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
* నివర్ తుపానులో పంట దెబ్బతిన్న 13.01 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.718 కోట్ల పెట్టుబడి రాయితీని ఈ నెల 29న అందజేస్తుంది. దీంతో 8,06,504 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
* గ్రామీణ మహిళలు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు కడప జిల్లా పులివెందులలో రూ.83.59 కోట్లతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఇర్మా) ఏర్పాటు. ఈ నెల 24న శంకుస్థాపన.
* సంక్షోభంలో ఉన్న పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు రూ.198.5 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీ. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ ప్రొవైడర్లు వంటి వివిధ విభాగాలకు చెందిన మొత్తం 3,910 యూనిట్లకు లబ్ధి. ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు రుణ సదుపాయం.
* చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డ్ నుంచి రూ.1931 కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఆమోదం.
* నియోజకవర్గ స్థాయి పశువ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో పని చేసేందుకు పశుసంవర్థక శాఖలో ఒప్పంద పద్ధతిలో 147 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, మరో 147 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టులభర్తీకి ఆమోదం.
* ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, పరిశోధన సంస్థ (ఏపీఎంఈఆర్‌సీ) ఏర్పాటుపై ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. ప్రస్తుతం ఉన్న వైద్య, నర్సింగ్ కళాశాలల బలోపేతం, కొత్త కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టనున్న సంస్థ.
* డిసెంబరు 21 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర భూసర్వే ప్రాజెక్టుకు, 1923 నాటి ఆంధ్రప్రదేశ్ సర్వే, హద్దుల చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోదం.
* ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్వే శిక్షణ కళాశాల ఏర్పాటుకు చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నయ్యగుంట గ్రామంలో 41.19 ఎకరాల భూమి కేటాయింపు.
* పప్పుదినుసులు, తృణధాన్యాల పరిశోధన కోసం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం చినపవని గ్రామంలో 410.30 ఎకరాల భూమిని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించేందుకు ఆమోదం.
* ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషణ్ నియామకానికి ఆమోదం
* కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల వద్ద 11.83 ఎకరాల భూమిని అటవీశాఖకు అప్పగించేందుకు ఆమోదం
* పులివెందుల బ్రాంచ్ కాలువ, సీబీఆర్ కుడి కాలువ రెండో దశ కింద సూక్ష్మసేద్య ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం.
రూ.200 కోట్లతో ఆరు జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి: పెద్దిరెడ్డి