‘‘పెట్రోలు, డీజిల్ ధరల్ని కేంద్రం ఎంత పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం అంతే స్థాయిలో పెంచింది. అలాంటప్పుడు కేంద్రం తరహాలోనే పన్ను భారం ఎందుకు తగ్గించడం లేదో వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర రహదారులపై గుంతలు పూడ్చలేని జగన్ ప్రభుత్వం... గోతులు తీసే రాజకీయం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తోంది’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో వైకాపా ప్రభుత్వం వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. ‘రాజధాని నిర్మాణం పేరిట రూ.4 సెస్ వసూలు చేస్తున్న ప్రభుత్వం.. రాజధాని ఎందుకు నిర్మించడం లేదు. రహదారుల పేరిట రూ.2 సెస్ వసూలు చేస్తూ రోడ్లపై గోతులు ఎందుకు పూడ్చలేదు’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కోసం.. కేంద్రం ఏం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో వైకాపా నేతలతో చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. ఆదివారం భాజపా యువ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ‘‘కేంద్రంతో పాటు దేశంలోని 80 శాతం రాష్ట్రాలు ఇంధన ధరలు తగ్గిస్తే... ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదు. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాలకు రూ.19 వేల కోట్లే ఇచ్చిందంటున్న మీరు.. అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో ప్రకటించాలి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. ప్రభుత్వంతో పోరాటానికి భాజపా సిద్ధం’’ అని హెచ్చరించారు.
రాజధానిపై మాటెందుకు తప్పారు?