రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జాతీయ వాదంతో కూడిన రాజకీయ వ్యవస్థ రాష్ట్రానికి కావాలన్నారు. భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన… కన్నా లక్ష్మీనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. భాజపా - జనసేన కూటమి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించనుందని సోము వీర్రాజు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే భాజపా విధానమని.. ఏపీలో మోదీయిజంను స్థాపించడమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రెండు కుటుంబ పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని వ్యాఖ్యానించారు.
తెదేపా, వైకాపా రెండూ సామాజిక సమతుల్యం అని పేరుకు చెబుతారు తప్ప.. ఎవరికీ అధికారం ఇవ్వరని సోము వీర్రాజు విమర్శించారు. ప్రస్తుత హోం మంత్రి ఒక డీఎస్పీని బదిలీ చేయగలరా అని ప్రశ్నించారు. మంచి పాలన, అభివృద్ధి ఇవ్వాలనేది భాజపా లక్ష్యమన్న ఆయన... అవినీతికి పాల్పడితే సహించబోమన్నారు.