SZC MEETING : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ విభజన అంశాలే కీలకంగా నిలిచాయి. చర్చించిన 26 అంశాల్లో 9 ఏపీకి చెందిన విభజన హామీలపైనే చర్చ జరిగింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ఏపీ తెలంగాణా రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగింది.
ఏపీ, తెలంగాణాకు చెందిన వివిధ అంశాలపై చర్చించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ అజెండాలో భాగంగా 26 అంశాలను ప్రతిపాదిస్తే అందులో 9 ఏపీ పునర్విభజన అంశాలే ఉన్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలూ పరస్పరం పరిష్కరించుకోవాల్సిన అంశాలను త్వరగా తేల్చుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. వ్యూహాత్మకంగా, వాణిజ్య పరంగా తీరప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రాలు భారత్ కు ఎంతో ముఖ్యమని వీటిని కలుపుతూ ప్రత్యేక రవాణామార్గాలను కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్‌షా వెల్లడించారు. మొత్తం 108 ప్రాజెక్టులకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.76 వేల కోట్లను వ్యయం చేసిందని తెలిపారు.